పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ టిఎంసి ఎంఎల్ఏలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యాఖ్యలు అంత్యంత చవకబారుగా ఉన్నాయని చంద్రబాబు ఆక్షేపించటమే విచిత్రంగా ఉంది. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం కలిగించాయనటంలో సందేహం లేదు. 

 

టిఎంసీ ఎంఎల్ఏలను లాగేసుకోవటం ద్వారా మమత బెనర్జీ ప్రభుత్వాన్ని కూలదోస్తామనే అర్ధం వచ్చేట్లుగా మోడి మాట్లాడారు. ముమ్మాటికి ఇది తప్పే. మోడి వ్యాఖ్యలు బిజెపిలోని సీనియర్ నేతలే సమర్ధించలేనంతగా ఉన్నాయి.  అదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ మోడి వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని తీవ్రంగా ఆక్షేపించారు. ఎంఎల్ఏలను లాగేసుకోవటం ద్వారా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మోడి కూలదోస్తారా అంటూ మండిపడ్డారు.

 

చంద్రబాబు ప్రశ్నల్లో తప్పు పట్టాల్సిన పనిలేమీ లేదు. మరి గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు చేసిందేమిటి ? అత్తకు బుద్ది చెప్పి కోడలు తెడ్డు నాకిందన్న సామెతలాగుంది చంద్రబాబు మాటలు. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, 3 ముగ్గురు ఎంపిలను చంద్రబాబు లాగేసుకున్నపుడు ఈ బుద్ది ఆనాడు ఏమైంది ? మోడి వ్యాఖ్యలే చవకబారుగా ఉంటే చంద్రబాబు చేష్టలను ఏమని వర్ణించాలి.

 

రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను లాగేసుకుని జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్రయత్నించలేదా ? సంతలో పశువులను కొన్నట్లుగా ఎంఎల్ఏలను, ఎంపిలను కొనుగోలు చేశారు కద ?  తాను ప్రజాస్వమ్య విధానాలకు తూట్లు పొడుస్తున్నట్లు చంద్రబాబుకు అపుడు  అనిపించలేదా ?

 

అందుకే అన్నారు చెప్పేటందుకే నీతులున్నాయని.  తాను చేస్తే సంసారం అదే ఇంకోరు చేస్తే మాత్రం..........అన్నట్లుంటాయి చంద్రబాబు మాటలు. వృద్ధనారీ పతివ్రత అన్నట్లుంది చంద్రబాబు చెప్పే మాటలు. అధికారంలో ఉన్నంత కాలం తాను చేసిందే రైటు అని చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  రెండోసారి అధికారంలోకి రావటం కష్టమని అనుకుంటున్న సమయంలో చంద్రబాబుకు హఠాత్తుగా ప్రజాస్వామ్య విలువలు, స్పూర్తి గుర్తుకొస్తున్నాయ్.


మరింత సమాచారం తెలుసుకోండి: