తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయనకు ఎపుడు ఏది కావాలో తెలుసు. అవసరం ఎవరితో పడుతుందో వారికే సలాం అంటారు. ఆయనది చాణక్య రాజకీయం. అందువల్ల బాబు ఎత్తులు పై ఎత్తులు అంత సులువుగా అర్ధం కావు. పోలింగ్ ముందు నుంచి బాబు వైఖరిలో మెల్లగా మార్పు వస్తోంది. ఇపుడు బాబు ఓ క్లారిటీతో ఉన్నట్లుగా అనుకోవాలి.


ఈసారి ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని బాబుకు నెమ్మదిగా అర్ధమవుతోంది. అందుకే ఆయన పార్టీ మీటింగుల్లో ధైర్యం ఇస్తూనే క్యాడర్ని ఓటమికి కూడా సిధ్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాబు పార్టీ రివ్యూ మీటింగులలో మాట్లాడుతూ తనకు నాయకులు కంటే క్యాడర్ చాలా ముఖ్యమని చెప్పుకున్నారు. వారు పార్టీకి పునాది అని కూడా అన్నారు. వారు లేకపోతే పార్టీ లేదని కూడా బాబు అసలు విషయం చెప్పేశారు.


అందువల్ల పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కోసం 100 కోట్ల  రూపాయల నిధులతో ప్రతి ఏడాది సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తానని భారీ ప్రకటన చేశారు. ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా తాము మాత్రమే అమలు చేస్తున్నట్లుగా బాబు చెప్పుకున్నారు. బాబు ప్రకటించిన ఈ పధకం నిజంగా గొప్పదే. కార్యకర్తల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఓ పార్టీ  వెచ్చించడం అరుదైనదే.


బాబు అసలు ఎందుకిలా క్యాడర్ ని టార్గెట్ చేస్తున్నారన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. టీడీపీకి ఇప్పటికే హార్డ్ కోర్ క్యాడర్ ఉంది. వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకే ఓటు చేస్తారు. నాయకులు పార్టీని వీడినా క్యాడర్ మాత్రం అలాగే అట్టిపెట్టుకుని ఉండడం చంద్రబాబు ఇచ్చిన ట్రైనింగు అని చెప్పాలి. అందువల్లనే క్యాడర్ ని మరింత గుర్తింపు బాబు ఇవ్వాలనుకుంటున్నారు. రేపు ఒక వేళ పార్టీ ఓటమిపాలు అయినా నాయకులు పోయినా పర్వాలేదు 


 క్యాడర్ గట్టిగా ఉంటే మళ్ళీ గెలవవచ్చు అన్నది బాబు ప్లాన్ గా కనిపిస్తోంది. అదే విధంగా తన వారసుడు లోకేష్ కి బలమైన, అంకితభావం కలిగిన క్యాడర్ ని అందిస్తే పార్టీ ఎప్పటికీ ఎక్కుచెదరదు అని బాబు భావిస్తున్నట్లుగా తోస్తోంది.  మొత్తానికి బాబు ఎవరిని నమ్మాలో వారినే నమ్ముకుంటున్నారు. చూడాలి మరి  ప్రజల తీర్పు, అసలు ఫ‌లితాలు ఎలా వస్తాయో ఏంటో.



మరింత సమాచారం తెలుసుకోండి: