అవును నిజంగా నిజమే ఇది. ఎవరో చెబితే నమ్మకపోవచ్చు కానీ స్వయంగా వైసిపి నేతే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. కృష్ణా జిల్లాలో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీకి, వైసిపి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.  

 

నియోజకవర్గంలో వంశీ చేసిన అరాచకాలు, కుంభకోణాలపై యార్లగడ్డ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వంశీ దంపతులు బెంగుళూరులో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు. జగన్ తో వంశీ దంపతుల భేటీ విషయం యార్లగడ్డ చెప్పగానే టిడిపిలో కలకలం మొదలైంది.

 

నిజానికి వంశీ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా ఉన్నదే. ఎందుకంటే, గుడివాడ వైసిపి ఎంఎల్ఏ కొడాలి నానికి వంశీ అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. గన్నవరం నుండి వంశీనే వైసిపి తరపున పోటీ చేస్తాడనే టాక్ చాలా కాలం నడిచింది. కానీ ఎందువల్లో వంశీ టిడిపి తరపునే పోటీ చేశారు. దాంతో యార్లగడ్డ వైసిపి అభ్యర్ధిగా పోటీలో దిగారు.

 

పోలింగ్ అయిన దగ్గర నుండి టిడిపి అధికారంలోకి రాదన్న అనుమానంతో కొందరు టిడిపి అభ్యర్ధులు వైసిపితో టచ్ లో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు కూడా ప్రస్తావించారు. దాంతో  వైసిపితో టచ్ లో ఉన్న టిడిపి అభ్యర్ధులు ఎవరెవరు అనే విషయమై పార్టీలో బాగా చర్చ జరుగుతోంది.

 

రాయలసీమ జిల్లాల్లోని ఎంపి అభ్యర్ధి అని ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులని ఇలా..రకరకాలుగా ప్రచారమవుతోంది. ఇందులో ఏ ప్రచారాన్ని కూడా కొట్టేసేందుకు లేదు. ఇంతలో యార్లగడ్డ స్వయంగా వంశీ విషయం బయటపెట్టటంతో  చంద్రబాబునాయుడు తో పాటు కృష్ణా జిల్లా టిడిపి నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. రేపటి కౌంటింగ్ లో వంశీ గనుక గెలిస్తే కొంపదీసి వైసిపిలోకి వెళిపోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఏం జరిగేది తెలియాలంటే 23 వరకూ వెయిట్ చేయాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: