ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రానికి రెండు కళ్లులాంటివని అన్నారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీయడంలో చంద్రబాబు ప్రధాన దోషి అని.. ఈ విషయంలో మోడీపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.  ఏపీ,  తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలను పరిష్కరించడానికి ఉమ్మడి గవర్నర్ ఉన్నారని గుర్తు చేశారు. 


ఏపీ,  తెలంగాణ ప్ర‌జలు కలిసి మెలిసి జీవిస్తున్నారని.. కానీ రాజకీయం కోసమే టీఆర్‌ఎస్‌తో చంద్రబాబునాయుడు గొడవ పెట్టుకున్నారని  అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని డ్రామాలాడినా చంద్రబాబుకు 'బెస్ట్ యాక్టర్ ప్రైజ్' కూడా వచ్చే అవకాశం లేదని జీవీఎల్ ఎద్దేవా చేశౄరు. ఊడిపోయే పదవి అని తెలిసే చంద్రబాబు కేబినెట్‌ భేటీ అంటూ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చాశారని జీవీఎల్‌ చెప్పారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టకూడదని, తన పదవి ఊడబోతొందని తెలిసే చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ అంటూ  హడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఎన్నికల సంఘం అనుమతి తోనే స్పెషల్ కేబినెట్ మీటింగ్ పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు ఎన్నికల కమిషన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.


ఈ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ రాబోతోందని జీవిఎల్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించే అవకాశమే లేదని అన్నారు. తమ సంతానానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి ఢిల్లీకి రావాలని చంద్రబాబు, కేసీఆర్ లు ఉబలాటపడుతున్నారన్నారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని, ఏపీలో కూడా ఆ పార్టీ చతికిలపడిందని ఆయన అన్నారు. 2024 కల్లా ఏపీ, తెలంగాణల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందన్నారు. ఈ రెండు రాష్ట్రాలను బిజెపికి కంచుకోటగా మారుస్తామని జీవిఎల్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: