ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు ప్రభుత్వానికి  సంబంధించిన ప్రశ్నలు వేయడంపై పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఎంవీఎస్ నాగిరెడ్డి అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి ఏపీపీఎస్సీ, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలపై ఫిర్యాదు చేశారు.  అనంతరం విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో  పోలింగ్ ముగిసిన తరువాత నుంచీ చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈసీ, ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు అంటూ ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు కుట్రతో వ్యవస్థలన్నింటినీ భ్ర‌ష్టు పట్టించారని మండిప‌డ్డారు. అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న కుట్రతో  చంద్రబాబు అన్ని వ్యవస్థలలోకి తన మనుషులను చేర్చారని ఆరోపించారు. ``ఆదివారం జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో.. ఎన్నికల్ కోడ్ అమలులో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఒకవైపు ఎన్నికల రీపోలింగ్ జరుగుతుంటే ఇలాంటి ప్రశ్నలా? ఏపీపీఎస్సీలో చంద్రబాబు మనుషులు ఉన్నారు కనుకే ఉడతా భక్తిగా ఇలాంటి ప్రశ్నలు.. ఇంకా నయం టీడీపీ ఎన్నికల గుర్తు ఏంటి? చంద్రబాబు మనవడి పేరు ఏంటి? లోకేశ్ పోటీ చేసిన నియోజకవర్గం పేరు ఏమిటి? అని అడగకపోవడం సంతోషం``అని ఎద్దేవా చేశారు.


ఏపీపీఎస్సీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశామ‌ని అంబ‌టి రాంబాటు వెల్ల‌డించారు. ``చట్టానికి, ఎన్నికల కోడ్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన ఏపీపీఎస్సీ పై చర్యలు తీసుకోవాలి. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించినందుకా? చంద్రబాబు అంటే ఎంత భక్తి..!? ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల 23న చంద్రబాబు అధికారం కోల్పోతారు, అధికారం లేకపోతే చంద్రబాబు ఉండలేరు.  చంద్రబాబు తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. పోలవరం సందర్శించే నైతిక అర్హత లేదు చంద్రబాబు కి ఎక్కడిది? 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, నీళ్ళు ఇచ్చి ఎన్నికల్లో ఓటు అడుగుతామని చంద్రబాబు 2014లో చెప్పారు. మరి ఎందుకు అలా చేయలేదు?  అలానే ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  రాసుకో జగన్ .. అంటూ సవాల్ చేశాడు. ఎక్కడ రాసుకోవాలి. ఈరోజు నీ తల తీసి గోడకు రాసుకో..`` అంటూ మండిప‌డ్డారు. 


చంద్రబాబూ..! ఇది రాజ్యం, రాచరికము కాదు, ఇది ప్రజాస్వామ్యం అంటూ అంబ‌టి గుర్తు చేశారు. `` చంద్రబాబు మహా అయితే ఈ నెల 23వరకే కేబినేట్ మీటింగ్‌లు పెట్టగలరు, ఆ తర్వాత ఇక జీవితాంతం పెట్టలేరు. చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా అధికారులేవరూ రారు.. చంద్రబాబు ఇప్పుడు క్యాబినెట్ లో తీసుకునే నిర్ణయాలు ఎందుకూ పనికిరావు.. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో క్యాబినెట్ ఒకటి. ఈ నెల 23 తేదీన చంద్రబాబు దీపం ఆరిపోబోతుంది. తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని భయపడుతున్నాడు. తన ఓటమిని అంగీకరించలేక ఎన్నికల కమిషన్ పై రుద్దుతున్నాడు`` అని అంబ‌టి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: