తెలుగుదేశం పార్టీకి శత్రువులు ఎక్కడో  లేరట. వారిని పట్టుకోవడానికి మాత్రం లోకమంతా తిరగాల్సివచ్చిందట. ఇదే ఇపుడు ఉత్తరాంధ్రలో వాడి వేడిగా చర్చగా సాగుతోంది.  ఉన్న పార్టీనే ముంచేసి ప్రత్యర్ధికి సాయం చేస్తే తమ్ముళ్లకు ఎలా ఉంటుంది. ఇపుడు అదే మండిపోతోందట. పోలింగుకు కౌంటింగుకు మధ్య నలభయి రోజులకు పైగా గ్యాప్ రావడంతో గెలుపు అవకాశాలను ఆరా తీసే [పనిలో పడిన  తమ్ముళ్లకు ఇపుడు విభీషణుల గుట్టు బయటపడి కలవరపెడుతోందట. ఇలాంటి వారినా నమ్మి ఎన్నికల గోదాలోకి దిగామని మధనపడుతున్నారట.


విశాఖ రూరల్ జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఈసారి పోరు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగింది. వైసీపీలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేరడంతో తన రాజకీయ చాణక్యతో పావులు కదపడం ప్రారంభించారు. దీంతో టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి తెర వెనక  తోచిన సాయం చేశారని తెలిసింది. అదిపుడు టీడీపీ పరిశోధనలో వెలుగు చూడడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్ధి  పీలా గోవింద సత్యనారాయణ గుస్సా అవుతున్నారు.



టీడీపీలో ఉన్న ఎంపీ స్థాయి నేతలే హ్యాండ్ ఇవ్వడంతో గెలుపు అవకాశాలు ఎంతవరకూ దెబ్బ తిన్నాయన్నది అంతు చిక్కడంలేదుట. ప్రచారం మొత్తంలో పక్కనే ఉంటూ ప్రత్యర్ధి పార్టీకి సాయం చేసిన వైనం బయటకు రావడంతో సైకిల్ పార్టీలో కలవరం రేగుతోంది. అసలే గట్టిగా పోరు జరిగింది. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతోనే అని పోలింగ్ సరళి తెలియచేస్తున్న వేళ ఇలా సొంత పార్టీలో వెన్నుపోట్లు పొడవడం తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారుట. ఇక మండల, గ్రామ స్థాయి నాయకులు ఈసారి టీడీపీకి మనస్పూర్తిగా పనిచేయలేదని తేలడంతో అనకాపల్లిలో గెలుపు పై పీలా డీలా పడ్డట్లు భోగట్టా.


ఇక శ్రీకాకుళం టీడీపీ  ఎమ్మెల్యే అభ్యర్ధి గుండా లక్ష్మీ దేవికి పోలింగ్ వేళ కొన్ని వార్డుల్లో పోలింగ్ ఏజెంట్లు సరిగా పనిచేయలేదన్న సమాచారం తెలిసిందంట. దాంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని టాక్.  దీని మీద ఆరా తీస్తే కొందరు వైసీపీకి అనుకూలంగానే మౌనంగా తప్పుకున్నారని అంటున్నారు. దాంతో గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన లక్ష్మీ దేవికి ఈసారి కష్టమేనని అంటున్నారు. అలాగే చాలా చోట్ల తమ్ముళ్ళు డబ్బులు కూడా పంపిణీ చేయలేదని కూడా వార్తలు వచ్చాయి. దాంతో ఎన్ని సీట్లు గెలుస్తామో తెలియక టీడీపీ అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: