త్తరాంధ్ర  జిల్లాల్లో కొంతమంది టీడీపీ నాయకులకు అన్ని రకాల వ్యతిరేకతలతో పాటు అదనంగా వారసుల వ్యతిరేకత కూడా తోడు అయింది. అధికారంలో ఉన్నపుడు ప్రజావ్యతిరేకత ఎటూ ఉంటుంది. దాంతో పాటు, కుమార రత్నాలు కూడా కావాల్సినంత మైనస్ పాయింట్లు తెచ్చిపెట్టారని పోస్ట్ పోల్ సర్వేలు తేల్చడంతో గెలుపు విషయం తలచుకుని  తమ్ముళ్ళు హడలిపోతున్నారు. అటువంటి వారిలో విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరుగా చెప్పుకుంటున్నారు.


ఆయనకు కుమారుడు విజయ పాత్రుడి కారణంగా పార్టీలో గొడవ ఎంతవరకూ  వచ్చిందంటే సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడు పార్టీకి దూరంగా ఉండాల్సివచ్చింది. ఎన్నికల వేళ అన్నదమ్ములు కలసినా ఫలితం ఎంతవరకూ వస్తుందో తెలీని స్థితి. ఇక కుమారుడు, తమ్ముడు వేరుగా పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి.  ఆఖరుకు కుటుంబం కలసినట్లుగా ఉన్నా దిగువ స్థాయిలో క్యాడర్ కలవలేదని టాక్. ఇక సన్యాసిపాత్రుడు మొక్కుబడిగా పనిచేసినా ఆయన భార్య, మునిసిపాలిటి చైర్మన్ అనిత, ఆయన కుమారులు ఎవరూ కూడా మంత్రి గెలుపు కోసం పనిచేయలేదని సమాచారం.



ఇక టీడీపీకి కంచుకోట లాంటి సీట్లో ఇపుడు గెలుస్తామా లేదా అన్న అనుమానంలోకి పడిపోవడానికి అక్కడి టీడీపీ అభ్యర్ధి  పుత్ర రత్నం  పార్టీలో  చేసుకున్న అతి జోక్యమే కారణమని అంటున్నారు. ఆ సీటు విశాఖ అర్బన్ జిల్లాలో ఉన్న పెందుర్తి, ఇక్కడ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరో మారు పోటీకి దిగారు. నిజానికి ఆయన పట్ల జనంలో పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే అన్ని వ్యవహారాల్లో కుమారుడు అప్పలనాయుడు జోక్యం పెరిగిపయిందని ఆరోపణలు ఉన్నాయి. కుమారుడు దూకుడు ప్రవర్తనపై కార్యకర్తలు విసుక్కున్నా ఈ మాజీ మంత్రికి పట్టేది కాదు. ఇక జనమైతే వీళ్ళతో పడలేమని అనుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు తీరాలకు చేరడానికి అదే ప్రధాన కారణమైందంటున్నారు. సైకిల్ ఓడిపోతే మాత్రం ఆ ఘనత  అచ్చంగా కుమారిడికే దక్కుతుందని అంటున్నారు.


ఇక తన కుమార్తెను ఈసారి రాజకీయాల్లోకి తీసుకువచ్చిన విజయనగరం రాజా వారు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా అచ్చంగా వీరు పడ్డ బాధనే అనుభవించారు. కూతురు అదితిగజపతిరాజు ఎంట్రీతో రాజు గారి మీద కూడా అక్కడ పార్టీ జనం గుస్సా అయిపోయారు. చివరికి అధినేత చంద్రబాబు సర్దిచెప్పడంతో దారిలోకి వచ్చినట్లు కనిపించినా ఎవరు పుట్టె ముంచారో అన్నది తేలడంలేదు. కూతురుని ఓడించి తండ్రిని గెలిపించామని పార్టీలో కొంతమంది చెబుతూంటే, ఇద్దరికీ షాక్ ఇచ్చామని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి ఇక్కడ బీసీ  వర్గాల సెగ రాజా వారు  పూర్తిగా చవి చూశారు. తండ్రీ కూతురు గెలుస్తారా అన్నది రాజు గారి అభిమానులను  ఇపుడు యమ టెన్షన్ పెడుతోంది. గెలిస్తే ఒకరు, ఓడిపోతే ఇద్దరు అన్న మాట ఇపుడు అక్కడ వినిపిస్తోందంటే అది పూర్తిగా కుమార్తె తెచ్చిన తంటాగానే భావించాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: