దేశ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం సంభ‌వించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌ని నేప‌థ్యంలో పొత్తుల రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా వామ‌పక్షాల‌కు చెందిన ముఖ్య‌నేత ఒక‌రు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి గానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. ఈసారి హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని సోమవారం ఆయన వ్యాఖ్యానించారు. 


రెండు దశాబ్దాల కిందట ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మాదిరే ఈసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు కలిగిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు తాము వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. ఈసారి యునైటెడ్ ఫ్రంట్ తరహా సంకీర్ణ ప్రభుత్వం రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్డీయేకి అత్యధిక స్థానాలు దక్కొచ్చని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు మాత్రం దక్కవని పేర్కొన్నారు. 1996-98 మధ్య కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతునిచ్చింది.


తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌తో వామపక్షాలు చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వమే ఏర్పడాలని మేం ఆశిస్తున్నాం. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్ ప్రాంతీయ పార్టీలకు మెజారిటీ వస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. కానీ వారికి మెజారిటీ రాదు అని ఆయన పేర్కొన్నారు. వారు బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఎన్డీయే, యూపీఏలో ఏదో ఒకదానికి మద్దతివ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నారని, తాము (వామపక్షాలు) మాత్రం కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ వ్యతిరేకమని పేర్కొన్నారు. కాబట్టి తాము ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: