ఏపీఎస్‌ ఆర్టీసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. అదే రోజున దశలవారీ ఆందోళన కార్యక్రమాల వివరాలనూ ప్రకటించనుంది.  యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదరరావు తెలిపారు. 


 ఈ సందర్భంగా ఇచ్చిన లిఖితపూర్వక హామీల్లో ఒకటైన 2013 వేతన సవరణకు సంబంధించిన తొలివిడత బకాయిలను ఉగాది నాటికి విడుదల చేయవలసి ఉంది. నేటికీ విడుదల చేయలేదని, ఆ అంశంతో పాటు మరికొన్ని ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వనున్నామని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావులు తెలిపారు. 


ఆర్టీసీ కార్మికులకు 25% తాత్కాలిక ఫిట్‌మెంట్‌ కల్పించడంతో పాటు తొలివిడతగా 40% బకాయిలను విడుదల చేస్తామని ఆర్టీసీ రాతపూర్వకంగా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అయినప్పటికీ బకాయిలను విడుదల చేయకుండా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

డిమాండ్లు :
-  గుర్తింపు సంఘంతో ఎలాంటి చర్చలు జరపకుండా ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో సిబ్బంది కుదింపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి
-  ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి పొరుగు సేవల విధానంలో నియమాకాలు చేపట్టే ప్రయత్నాలు విరమించుకోవాలి.
-  కారుణ్య నియమాకాలు చేపట్టాలి.
-  మిగిలి ఉన్న ఒప్పంద ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
- ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన డబ్బులను సత్వరమే చెల్లించాలి



మరింత సమాచారం తెలుసుకోండి: