ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ,,,పోల‌వ‌రం సంద‌ర్శ‌న పేరుతో హడావుడి చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు తీరును వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఎండ‌గ‌ట్గారు. ప్ర‌చార ఆర్భాటం కోసం బాబు వేస్తున్న ఎత్తుల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నా రని  విమర్శించారు. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకు ఉందా? అని ప్ర‌శ్నించారు. 


పోలవరానికి శంకుస్థాపన చేసి కార్యరూపం తీసుకొచ్చింది దివంగ‌త నేత‌ వైఎస్‌ఆర్ రాజశేఖ‌ర్ రెడ్డి అని బొత్స స‌త్యనారాయ‌ణ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన అనుమతులను వైఎస్‌ఆర్‌ తీసుకొచ్చారని తెలిపారు. ``చంద్రబాబు నిన్న పోలవరం వెళ్లి నేను ఇంకా ముఖ్యమంత్రిని జూన్ 8 వరకు పదవి ఉంది అని కూడా  వ్యాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం సందర్శనలో ఎవరికి ఆక్షేపణ లేదు. చంద్రబాబు పోలవరం గురించి ఎన్నికల ముందు మాటలు.ఎన్నికల తర్వాత మాటలు పరిశీలించి  బేరీజు వేసుకోవాలని ప్రజలనుకోరుతున్నాను.


2005లో పోలవరం స్వర్గీయ వైఎస్ శంఖుస్దాపన చేశారు.గతంలో ఎంతోమంది నేతలు పోలవరం కావాలని అనుకున్నారు. కాని కార్యరూపం మాత్రం వైఎస్ తేగలిగారు. ఆ సంఘటనలో ఆరోజుప్రభుత్వంలో మంత్రిగా ఆ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా నాక్కూడా అందులో పాల్గొనే అవకాశం కలిగింది. అది అద్బుతమైన సంఘటన, మరపురాని సంఘటన, దానిక్కావాల్సిన అన్ని అనుమతులను కూడా అంటే కేంద్ర అనుమతులు.ల్యాండ్ పర్మిషన్లు వైఎస్ తీసుకువచ్చారు.దాంతో పాటు కాలవలకు కూడా 4,500 కోట్లు ఖర్చు చేసి పనులు కూడా  చేశారు.ఇది వైఎస్ కే దక్కింది. వైఎస్ జీవించి ఉండిఉంటే పోలవరం పూర్తై దాని ఫలితాలను అనుభవించేవారం. సాగునీరు, తాగునీరు, విద్యుచ్చక్తి వంటివి అందుబాటులోకి వచ్చి బహూళార్దకంగా ఉపయోగపడి ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలేరు.`` అని పేర్కొన్నారు.


రాష్ట్ర  విభజన నేపధ్యంలో పోలవరం ను జాతీయప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించి నిర్మాణ నిధులు,భూసేకరణ కేంద్రం భరించాలని చట్టంలో పెట్టారని అయితే, బాబు స్వార్థం కోసం దాని ప‌నితీరు మారింద‌న్నారు. ``విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొద్ది మెజారిటీతో అధికారంలోకి టిడిపి వచ్చింది. చంద్రబాబు సిఎంగా 2014 జూన్ లో ప్రమాణ స్వీకారం చేసి  పోలవరం 2018లో పూర్తి చేస్తానని ప్రజలకు చెప్పారు. 2016 సెప్టెంబర్ ఏడోతేదీన జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరం ను ప్రారంభించారు. ఢిల్లీకి పోయి మిగిలిన ప్రయోజనాలను అంటే ప్రత్యేక హోదా విభజన హామీలు తాకట్టుపెట్టి పోలవరం నిర్మాణం మాకివ్వండి అని చంద్రబాబు తెచ్చుకున్నారు. అప్పటి వరకు రెండుసంవత్సరాలు వృధా చేసి పోలవరం కోసం పిడికెడు మట్టి కూడా వేయలేదు.

కేవలం కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం కక్కుర్తి పడి ,పట్టిసీమను ముడుపుల కోసం ఎన్నికలలో డబ్బులు వెచ్చించిన వారికోసం నిర్మించారు. ఆ తర్వాత రెండేళ్ల వరకు పోలవరం పనులు ప్రారంభించకుండా కాలయాపన చేశారు. పోలవరం నిర్మాణం హడావుడిగా చేపట్టి ఆరోజుకు 16 వేల కోట్లు కాస్ట్ ఉంటే ఎస్టిమేషన్ పెరిగిందని చెప్పి 55 వేల కోట్ల రూపాయలుకు వ్యయాన్ని పెంచిన మాట వాస్తవమా కాదా  చెప్పండి. 16,493 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని చంద్రబాబునోటితోనే స్వయంగా చెప్పారు. శాసనసభలో సిఎం,ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమలు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. 2018లో అని ఒకసారి,2019లో అని ఒకసారి గ్రావిటితో నీరు ఇస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించారు.

పోలవరం లో  ఓ గేటు వేస్తే అట్టహాసం,కాంక్రీటు వేస్తే,భారీయంత్రాలు తెస్తే అట్టహాసంగా ప్రచారం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారు. నిన్న మాత్రం 2020 నాటికి గ్రావిటితో నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.దానికి కారణం ఈసి చర్యల కారణంగా 40 రోజుల ఆలస్యానికి సంవత్సరంన్నర కు పూర్తి అవుతుందని చెబుతున్నారు. మీరు ఖర్చు పెడతానన్న 55 వేల కోట్లలో 16 వేల ఖర్చు పెట్టి 75 శాతం పనులు పూర్తి అయ్యాయని ఏవిధంగా ప్రకటిస్తున్నావు చంద్రబాబు? ఎటూ ఎన్నికలు అయిపోయాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.

16 వేల కోట్లలో 6 వేల కోట్లు కేంద్రం ఇప్పటికే ఇచ్చింది.వైఎస్ గతంలో 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవాలు ఇవైతే దొంగలెక్కలు చెబుతున్నారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ అనడంలో సందేహం లేదు. అవినీతికి,కాంట్రాక్ట్ కోసం కాసుల కక్కుర్తికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పోలవరం పూర్తి చేస్తాం. ఇకనైనా చంద్రబాబు జిమ్మిక్కులు, మోసాలు ఆపాలి`` అని బొత్స సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: