అవును ఇపుడీ అంశంపైనే అధికారయంత్రాంగంలో బాగా చర్చ జరుగుతోంది. గడచిన ఐదేళ్ళు చంద్రబాబునాయుడును దగ్గరుండి నడిపించిన అత్యంత సన్నిహితులైన ఐఏఎస్ అధికారులు ఢిల్లీ సర్వీసులకు  వెళ్ళిపోవాలని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.  రేపటి కౌంటింగ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడనే వీరంతా బలంగా నమ్ముతున్నారు. జగన్ సిఎం అయితే తమ మనుగడ కష్టమని భావించే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటానికి అన్నీ సర్దేసుకుంటున్నారు.

 

ఐదేళ్ళుగా  చంద్రబాబు టీంలో పలువురు ఐఏఎస్ లు కీలకంగా వ్యవహరించారు. సిఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర అందరిలోను అత్యంత కీలకమైన అధికారి. సిఆర్డీఏ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, గిరిజా శంకర్, అనీల్ చంద్ర పునేఠా,  ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు ముఖ్యులు. వీళ్ళు కాకుండా డిజిపి ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు కూడా కీలకమే.

 

ఐదేళ్ళ చంద్రబాబు పాలన చాలా చెత్తగా సాగిందనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీసుకున్న చాలా తప్పుడు నిర్ణయాల్లో పై అధికారుల పాత్ర చాలా ఉందని ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాల సంగతి పక్కన పెట్టినా టిడిపిలోని చాలామంది కూడా ఇదే విధంగా మండిపోతున్నారు. తమ పబ్బం గడుపుకోవటానికి మాత్రమే ఉన్నతాధికారులు చంద్రబాబును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు చాలనే ఉన్నాయి.

 

ఇటువంటి అధికారుల్లో కొందరు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటానికి డివోపిటికి దరఖాస్తు చేసుకున్నారట. సతీష్ చంద్ర, అజయ్ జైన్, ఠాకూర్, గిరిజా శంకర్ లు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అంటే ఐదేళ్ళ పాలనపై  రేపటి రోజున అధికారంలోకి వచ్చే పార్టీ విచారణ జరిపించాలని నిర్ణయించుకుంటే చంద్రబాబు ఒంటరిగానే పోరాటం చేయాల్సుంటుంది. సలహాలిచ్చింది ఎవరైనా పాటించిన చంద్రబాబుదే పూర్తి బాధ్యత.

 

రాబోయే ప్రభుత్వం సిఎంవో నిర్ణయాలపై విచారణ చేయిస్తే చంద్రబాబు టీంలో  ఎంతమంది బాధ్యత తీసుకుంటారన్నది అనుమానమే.  ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులే ఇష్టారాజ్యంగా వ్యవహిరంచారని, ఏ విషయంలోను నిబంధనలు పాటించలేదని రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ్ కల్లం చాలా సార్లే ఆరోపించారు.  అందుకే ప్రభుత్వం మారితే తమకు ఇబ్బందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబుకు సన్నిహితులైన ఐఏఎస్ లు ఢిల్లీకి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: