రేపు వైసిపి అధికారంలోకి వస్తే వైఎస్ షర్మిల పోషించబోయే పాత్ర ఎలాగుంటుంది ? అనే అంశంపై పార్టీలోను, వైఎస్ కుటుంబ అభిమానుల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం, జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే షర్మిల పాత్ర తెరవెనుకకే పరిమితమవుతుందని తెలుస్తోంది.

 

ప్రాంతీయ పార్టీలంటే ఒక విధంగా వ్యవస్ధాపక అధ్యక్షుల సొంత ఆస్తి అనే అనుకోవాలి.  టిడిపిలో ఎన్టీయార్ కు జరిగిన వెన్నుపోటు లాంటివి జరిగితే తప్ప నాయకత్వం చేతులు మారే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్నది చూస్తుంటే అదే అభిప్రాయం స్ధిరపడుతుంది.

 

ప్రాంతీయ పార్టీల్లో ప్రత్యామ్నాయ అధికార వ్యవస్ధ ఎదగాలని ఎవరూ  కోరుకోరు. ఏ రాష్ట్రమైన, ఏ పార్టీ అధ్యక్షుడైనా అదే పంథా అనుసరిస్తారనటంలో సందేహం లేదు. ఏపిలో జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదు. ఇప్పటికి రెండు ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తుందనే ప్రచారం బాగా జరిగింది. కానీ షర్మిల ఎక్కడా పోటీ చేయలేదు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.

 

నిజంగానే షర్మిల గనుక యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటే కుటుంబంలో సమస్యలు మొదలవ్వటం ఖాయం. ఎందుకంటే, జగన్ తో నేరుగా మాట్లాడలేని వారందరూ లేకపోతే జగన్ ను కలవటం కష్టమని అనుకున్న వారందరూ షర్మిల వైపే చూస్తారు. ఏదో తిరుమల శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వరస్వామికి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోయినట్లు వెళ్ళటం కుదరదు కద.

 

తన దగ్గర నేతలు ప్రస్తావించిన సమస్యలనో లేకపోతే పదవులు ఆశిస్తున్న నేతల బాధలనో, డిమాండ్లనో ఏదో ఒక సందర్భంలో జగన్ తో షర్మిల ప్రస్తావించక తప్పదు. ఒకసారంటూ చర్చించటం మొదలైతే అది ఒకసారితో ఆగదు. కచ్చితంగా షర్మిల వైసిపిలో మరో పవర్ పాయింట్ అవ్వటం ఖాయం. ప్రత్యామ్నాయ పవర్ పాయింట్ ను జగనే కాదు ఏ అధ్యక్షుడు సహించడు.

 

తెలంగాణాలో హరీష్ రావు పరిస్ధితి ఏమైంది ?  క్షేత్రస్ధాయిలో తనకున్న ఫాలోయింగ్ తో హరీష్ టిఆర్ఎస్ లో కెసియార్ కు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. నిజం చెప్పాలంటే హరీష్ లేకపోతే టిఆర్ఎస్ లేనే లేదు. కానీ అదంతా ప్రతిపక్షంలో ఉన్నపుడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ గొంతే ఎక్కడా వినబడటం లేదు చూడండి. కొడుకు భవిష్యత్తు కోసం మేనల్లుడైనా సరే హరీష్ ను కెసియార్ తొక్కిపడేస్తున్నారు. కాబట్టి జగన్ అయినా అదే పని చేస్తారు. అందులో ఎటువంటి మినహాయింపు ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: