తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ఇత‌ర రాష్ట్రాల‌ మ‌న‌సు గెలిచే ప్ర‌య‌త్నం చేశారు. గ‌త‌వారం వర‌కు త‌న ప్ర‌తాపం చూపించిన ఫొని తుఫాన్ వల్ల ఒడిశా అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త‌ శుక్రవారం ఒడిశాపై విరుచుకుపడిన ఫొని తుఫాన్.. రాష్ట్రంలో 35 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో వృక్షాలు , విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకూలాయి. ఫొని తుఫాన్ ధాటికి అతలాకుతలమైన ఒడిశాలో.. నీటి సరఫరా, విద్యుత్, టెలి కమ్యూనికేషన్ వంటి కీలక సేవల పునరుద్ధరణకు నిపుణులైన సిబ్బంది తగినంత మంది లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల విద్యుత్ స్తంభాలను మార్చాల్సి ఉందని అధికారులు తెలిపారు. 


గ‌త మంగళవారం భువనేశ్వర్, పూరీ జిల్లాలో పరిహార పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్రపారా, జగత్‌సింగ్‌నగర్ తదితర జిల్లాల్లోనూ సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ప్రతీదీ విద్యుత్ సరఫరాపైనే ఆధారపడి ఉంది. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా లేని కారణంగా పెట్రోల్ బంకులు పనిచేసే అవకాశం లేదు అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వ్యాఖ్యానించారు. ఫొని తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఆయన మంగళవారం పూరీలో పర్యటించారు.


అయితే, ఇలా ఒడిశా ఇబ్బందుల్లో ఉండ‌గా, ఆ రాష్ట్రంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా ను పునరుద్ధరించేందుకు తెలంగాణ నుంచి వెయ్యిమంది ఉద్యోగులు మంగళవారం తరలివెళ్లారు. ఒడిశాలో కరంట్ స్తంభాలు పడిపోయి, లైన్లు తెగి చాలా ప్రాంతాలకు విద్యు త్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తమకు సహకారం అందించాలని ఒడిశా.. తెలంగాణ ప్రభుత్వా న్ని కోరింది. స్పందించిన సీఎం కేసీఆర్.. సీఎస్ జోషి, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో మాట్లాడి ఒడిశాకు సహా యం అందించాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: