తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల‌పై అయోమ‌యం నెల‌కొంది. మ‌ళ్లీ వివాదం ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అధికార టీఆర్ఎస్‌ పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. దీంతో సీఈసీ నిర్ణ‌యంపై అంద‌రి చూపు ప‌డింది.


కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ భేటీ అయ్యారు. స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలను ఈసీకి తెలిపారు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ షెడ్యూల్ ఇచ్చి తెల్లవారుజాము నుంచే నామినేషన్ స్వీకరించడంలో ఏదో మతలబు ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.. అధికార టీఆర్ఎస్‌ పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని పేర్కొన్నారు. 


అనంత‌రం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని ఈసీని కోరామన్నారు. తెలంగాణలో ఎన్నికలు గూడు పుఠాణిలాగా మారాయని దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. “టీఆర్ఎస్‌కు లబ్ది చేర్చేవిధంగా పాత ఎంపీటీసీ, జడ్పిటీసీలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల ఓటింగ్ లో అవకాశం ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్ద కుట్ర పన్నారు. ఎన్నికల కమిషన్  కు అన్ని వివరాలను అందజేశాం. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది” అని దాసోజు శ్రవణ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: