రేషన్‌కార్డు కోసం నిరీక్ష‌ణ‌లో ఉన్న‌వారెంద‌రో! అలాంటి వారికోసం ప్ర‌భుత్వం త‌ర‌ఫ నుంచి తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హులందరికీ వేగంగా రేషన్‌కార్డులు జారీచేసేందుకు తెలంగాణ‌ పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జారీచేయాలని యోచిస్తోంది. జూన్1 నుంచి జూలై 1 వరకు రోజువారీగా టార్గెట్‌ను నిర్దేశించుకుని కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు హెచ్‌ఎండీఏ, ఇద్దరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన అధికారులతో నియమించిన కమిటీలు పలు సిఫారసులు చేశాయి. ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రేషన్‌కార్డులను జారీచేయాలని అధికారికంగా ఉత్తర్వులు జారీఅయ్యాయి. 


హెచ్‌ఎండీఏ పరిధిలో దరఖాస్తులు అధికంగా ఉన్నందున ప్రతి ఏపీఎస్‌వో ఆఫీసుకు అదనంగా ఒకడాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఏడురోజుల్లోనే కార్డులను జారీచేయాలని ఆదేశించారు. చీఫ్ రేషనింగ్ కార్యాలయం పరిధిలో రేషన్‌కార్డుల జారీ, 6ఏ కేసుల పరిష్కారంలో, రేషన్ డీలర్ల నుంచి గోనె సంచుల సేకరణలో అంకితభావంతో విధుల నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని కమిషనర్ అభినందించారు. బుధవారం సీఆర్వో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.


రేషన్‌కార్డుల జారీకి ప్రత్యేక కమిటీల సూచనలు
-క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏసీఎస్‌వోలు లాగిన్‌కు వచ్చిన దరఖాస్తుదారులకు ఏడురోజుల్లోగా కార్డుల జారీ ప్రక్రియను పూర్తిచేయాలి.
-జిల్లా ప్రాజెక్ట్ అసోసియేట్ (డీపీఏ)ల సహకారంతో ఈ-పీడీఎస్ (ఎలక్ట్రానిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ) పనులను పూర్తిచేయాలి. 
-పెండింగ్ దరఖాస్తులు అధికంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చీఫ్ రేషనింగ్ కార్యాలయం నుంచి సీనియర్ చెకింగ్ ఆఫీసర్లను విచారణ అధికారులుగా నియమించి త్వరితగతిన రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలి.
-మీ సేవ/ ఈ సేవ కేంద్రాల్లో రేషన్‌కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలి. 
-ఈ కేంద్రాల్లో మొత్తం కుటుంబసభ్యుల బయోమెట్రిక్‌లను కూడా తీసుకోవాలి. దీనివల్ల పారదర్శకత మరింత పెరిగి అర్హులైన వారికి మాత్రమే కార్డు జారీ చేయడం సులువవుతుందని అధికారుల కమిటీలు సూచించాయి. మీ సేవ/ ఈ సేవ కేంద్రాల్లో అన్ని వివరాలతో పూర్తిగా నింపిన దరఖాస్తులను మాత్రమే స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయడం ద్వారా విచారణ సమయం కూడా ఆదా అవుతుందని కమిటీలు అభిప్రాయపడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: