కొంద‌రు చేసిన ప‌ని అంద‌రి మ‌ధ్య విబేధాల‌కు దారి తీస్తోంది. విధ్వంసానికి కార‌ణం అవుతోంది. శాంతియుత వాతావ‌ర‌ణానికి చిరునామాగా నిలిచిన శ్రీ‌లంక‌లో ఈస్టర్ ఆదివారం పేలుళ్లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. పేలుళ్ల‌ అనంతరం శ్రీలంకలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ.. ఇంకా ఘర్షణలు చోటు చేసుకుంటున్నా యి. తాజాగా, నెగోంబో సమీపంలోని పోరుటోటా గ్రామంలో ఆదివారం ముస్లింలు, క్యాథలిక్కుల మధ్య రేగిన ఘర్షణ విధ్వంసానికి దారితీసింది.


పోరుటోటా గ్రామంలో ఓ ముస్లిం వ్యక్తి నడుపుతున్న వాహనాన్ని తనిఖీ చేసేందుకు క్యాథలిక్కులు యత్నించడంతో.. సదరు వాహన యజమాని వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగి చివరకు పోరుటోటాలోని పలు ముస్లింల దుకాణాలకు నిప్పుపెట్టే వరకు వెళ్లింది. క్యాథలిక్కులు జరిపిన దాడిలో రెండు దుకాణాలు పూర్తిగా ధ్వంసం కాగా, ఓ వాహనం దగ్ధమైంది. గ్రామంలో రెండువర్గాలవారు మద్యం సేవించి ఉండటం వల్లనే ఘర్షణలు చెలరేగాయని.. ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు మరిన్ని పోలీసు బలగాలను దింపినట్టు పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. 


ఈ ఘర్షణల్లో నష్టపోయినవారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే హామీ ఇచ్చారు. ఘర్షణలు జరుగడానికి ప్రేరేపిస్తున్న మద్యం అమ్మకాలను నిషేధించాలని, ఈ దాడులతో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని అంతర్జాతీయ ఉగ్రసంస్థల మోసపు మాటలకు ఆకర్షితులై దాడులు చేస్తున్నారని కొలంబో ఆర్చ్‌బిషప్ కార్డినల్ మాల్కం రంజిత్ చెప్పారు. కాగా, ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని స్థానిక చర్చి అధికారులు సూచనలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: