విచిత్రమేమిటంటే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతటా మారుమోగిన పదం పికె. అంతకన్నా ఆశ్చర్యమేమిటంటే మూడు పార్టీల నేతలూ తమ గెలుపు కోసం పికె పైనే ఆధారపడటం. పికె అనేవి రెండు అక్షరాలే కానీ పార్టీల వారిగా అర్ధాలు మాత్రం వేరుగా ఉన్నాయి లేండి.

 

వైసిపి నేతల పరిభాషలో పికె అంటే ప్రశాంత్ కిషోర్ అని. అలాగే తెలుగుదేశంపార్టీ నేతల మాటల్లో పికె అంటే పసుపు-కుంకుమ అని. ఇక చివరగా జనసేన నేతల మాటలకు పికె అంటే అర్ధం పవన్ కల్యాణ్ అని. తమ గెలుపుకు పికె ఓ తారక మంత్రంగా పనిచేశారని వైసిపి నేతలంటున్నారు . తమను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేది పికెనే అని చంద్రబాబునాయుడు బాగా నమ్ముతున్నారు. రేపటి కౌంటింగ్ తర్వాత కింగ్ అయినా కింగ్ మేకరైనా తమ పికెనే అని జనసేన నేతలు గంపెడాశతో ఉన్నారు.

 

పార్టీని అధికారంలోకి తేవాలన్న టార్గెట్ తో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్ధాయిలో ఎంత కష్టపడింది అందరూ చూసిందే. పాదయాత్రతో పాటు అనేక కార్యక్రమాలతో వైసిపి జనాల్లోకి  చొచ్చుకుపోయిందంటే తెరవెనుక ప్రశాంత్ కిషోరే కారణమని చెప్పక తప్పదు. పికె సామర్ధ్యంపై నమ్మకంతోనే కదా జగన్ అంత భారీ కాంట్రాక్టు ఇచ్చి మరీ ఒప్పందం కుదుర్చుకున్నది.

 

అదే విధంగా చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో చాలా వర్గాలు  తెలుగుదేశంపార్టీకి దూరమయ్యాయి. మామూలుగా అయితే రెండోసారి టిడిపి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం టిడిపి నేతల్లోనే చాలామందికి లేదు. కాకపోతే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ రూపంలో ప్రతీ మహిళ ఖాతాలో వేలాది రూపాయలు జమ చేయించారు. దాంతో 98 లక్షల మహిళలంతా పసుపు కుంకుమ సెంటిమెంటుకు ఫిదా అయిపోయి టిడిపికి ఓట్లేశారని చంద్రబాబు నమ్ముతున్నారు.

 

ఇక చివరగా సొంతంగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం జనసేనకు లేదు. అధికారంలోకి వచ్చే ఆశలు లేకపోయినా పికె అంటే పవన్ కల్యాణే కింగ్ మేకర్ అవుతారంటూ జనసేన నేతలు ఎందుకో గుడ్డి నమ్మకంతో ఉన్నారు. పవన్ చేసిన మాయ వల్ల తక్కువలో తక్కువ 30 స్ధానాల్లో తమ పార్టీ గెలుస్తుందని జనసేన నేతలంటున్నారు. అదే సమయంలో ఐదు పార్లమెంటు స్ధానాల్లో గెలుపు ఖాయమని కూడా చెబుతున్నారు. మొత్తానికి మూడు పార్టీల్లోని పికె పదం ఎవరిని అందలం ఎక్కిస్తుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: