ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వ‌ద్ద‌కు కీల‌క ద‌ర‌ఖాస్తు ఒక‌టి వ‌చ్చింది. స‌మాచారం వెల్ల‌డిస్తే...ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు కానుంద‌ని అంటున్నారు. ఈ సంచ‌ల‌నానికి బీజేఎల్పీ నేత పీ విష్ణుకుమార్ రాజు కార‌ణంగా మార‌నున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత అయిదేళ్లుగా అవినీతి అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై తీసుకున్న చర్యలు తదితర అంశాలతో సమగ్ర సమాచారం ఇప్పించాల్సిందిగా బీజేఎల్పీ నేత పీ విష్ణుకుమార్ రాజు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 14వ శాసనసభ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు అంశాల్లో జరిగిన పరిణామాల వివరాలు ఇప్పించాల్సిందిగా లేఖలో అభ్యర్థించారు.


గడచిన అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన దాడుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ అయిదేళ్ల కాలంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? అవినీతి కేసుల్లో పట్టుబడిన అధికారుల్లో ఎవరికైనా తిరిగి ఉద్యోగం ఇచ్చారా. ఇస్తే అందుకు పాటించిన ప్రమాణాలేమిటి వంటి వివరాలు ఇవ్వాల్సిందిగా సీఎస్‌కు రాసిన లేఖలో విష్ణుకుమార్ రాజు కోరారు. అలాగే గత అయిదేళ్ల కాలంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు ఇప్పించాల్సిందిగా కోరారు. ప్రభుత్వ శాఖలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫారసులు, తీసుకున్న చర్యల నివేదిక ఇచ్చేలా విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. 


తాను ఎమ్మెల్యేగా విశాఖలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల టాంపరింగ్ తదితర అంశాలపై ప్రభుత్వం స్పందించి ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికపై కూడా విష్ణుకుమార్ రాజు లేఖాస్త్రం సంధించారు. ప్రభుత్వం నియమించిన సిట్ పలు అంశాలను ప్రస్తావిస్తూ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. దీనిపై మంత్రి వర్గంలో కూడా చర్చించారని, అయితే నివేదిక అంశాల మేరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. సిట్ నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడం వెనుక అర్ధం ఏమిటి. సిట్ నివేదిక అంశాలను తనకు ఇప్పించాల్సిందిగా కోరారు. ఇటీవల విశాఖలో కలకలం సృష్టించిన రేవ్ పార్టీకి సంబంధించి సమగ్ర విచారణ నివేదిక కోరుతూ లేఖ రాశారు. రేవ్ పార్టీలో పెద్దల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు నిర్ధారిస్తున్న నేపథ్యంలో విచారణ అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని అనుమానం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: