తెలుగులో పాపుల‌ర్ అయిన టీవీ ఛాన‌ల్ టీవీ9లో ప‌రిణామాల‌పై సంచ‌ల‌న క‌థ‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ర‌విప్ర‌కాశ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌వి చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో అలందా మీడియా యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని అలందా మీడియా ఆరోపిస్తోంది. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటూ రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించింది. 


రవి ప్రకాశ్‌తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేయ‌డంతో, ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72  కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 91 శాతానికి పైగా అలందా మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాశ్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు 40 వేల షేర్లు టీవీ9లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాశ్‌, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని అలందా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.


టీవీ9 ఆఫీసుతో పాటుగా సీఈవోగా  పనిచేసిన రవి ప్రకాశ్‌ నివాసంతో పాటు... హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల సమయంలో రవిప్రకాష్ ఇటు టీవీ9 కార్యాలయంలోనూ.. తన నివాసంలోనూ అందుబాటులో లేరు. మరోవైపు సోదాల సమయంలో టీవీ 9 కార్యాలయంలో కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్టు పోలీసులు గుర్తించారు. ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన  ర‌విప్ర‌కాశ్ పారిపోయారా లేక విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేనే చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: