ఆడ‌లేన‌మ్మ మ‌ద్దెల ఓడు! అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఐదేళ్ల పాల‌న‌లో ఎన్ని విజ‌యాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొంటున్నారో.. అన్ని అప‌జ‌యాలు, త‌మ్ముళ్ల త‌ద్ధిన‌క‌త‌క‌లు చాలానే ఉన్నాయి. ఇక‌, ఆది నుంచి కూడా తాను చేసిన అభివృద్ధే త‌న‌ను గెలిపిస్తుంద‌ని చెబుతూ వ‌చ్చిన చంద్ర‌న్న‌.. ఎన్నిక‌ల ముంగిటికి వ‌చ్చే స‌రికి మాత్రం నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో అనుస‌రించిన ఫార్ములానే అనుస‌రించారు. మ‌హిళ‌ల‌కు రూ. 10 వేల చొప్పున ప‌సుపు-కుంకుమ పందేరం చేశారు. నిజానికి పోల‌వ‌రం నుంచి 2018 చివ‌రి నాటికి నీళ్లివ్వ‌క‌పోతే.. ఓట్ల‌డ‌గ‌న‌ని చెప్పిన చంద్ర‌బాబు, అమ‌రావ‌తిలో శాశ్వ‌త నిర్మాణాల‌ను కొన్నింటినైనా పూర్తిచేస్తాన‌న్న చంద్ర‌న్న వాటిని ప‌క్క‌కు పెట్టారు. 


సంక్షేమ తంత్రంతో ఓట్ల కొనుగోలుకు అధికారికంగా తెర‌లెత్తారు. ఎన్నిక‌ల కోడ్‌లోని నియ‌మ‌నిబంధ‌న‌ల్లోని లోపాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు క‌దిలారు. 94 ల‌క్ష‌ల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు పంచారు. అప్ప‌టి వ‌ర‌కు రైతుల‌పై లేని ప్రేమ‌ను అన్న‌దాత సుఖీభ‌వ పేరుతో వండివార్చారు. మొత్తానికి అభివృద్ధి ప‌క్క‌కు పోయి.. ఆర్థికంగా ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుని ఓట్లు రాల్చుకుందామ‌న్న ప్ర‌య‌త్నం బాగానే చేశారు. ఇక‌, ఎన్నిక‌లు ముగిశా యి. పోలింగ్ స‌ర‌ళిని చంద్ర‌బాబు చాలా నిశితంగా ప‌రిశీలించారు. ప్ర‌జ‌ల్లో ఎక్క‌డో అసంతృప్తి, ఏవ‌గింపు, మాట మార్చ డం అనే ల‌క్ష‌ణాల‌ను గ‌ట్టిగా ప‌ట్టించుకున్నార‌ని, మార్పు దిశ‌గా అడుగులు వేశార‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింది. 


దీంతో ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. వెంట‌నే త‌న ఓట‌మికి గ‌ల కార‌ణాలు కూడా వెతికేసుకున్నారు. తాను గెలిస్తే.. మొత్తం తాను చేసిన సంక్షేమం, అభివృద్ధితోనే గెలిచాన‌ని చెప్పుకొనేందుకు ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక‌, ప్లాన్ బీ కూడా ఎన్నిక‌ల రోజే సిద్ధం చేసుకున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాలలో చంద్రబాబు ఓడిపోతే అది ఆయన తప్పుకాదట. ప్రజావ్యతిరేకత అస్సలు లేదట.. కేవలం ఈవీఎంలలో లోపాల వల్ల మాత్రమే టీడీపీ పార్టీ ఓడిపోయిందని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు దేశవ్యాప్తంగా దిగ్విజయంగా పనిని ప్రారంభించారు. 


గెలిస్తే తన ప్రతిభ, ఓడితే మాత్రం ఈవీఎం కుట్ర అని తెరతీయడానికి చంద్రబాబు సర్వం సిద్ధం చేస్తున్నారట.. అంతేకాదు.. సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తుకు పడుతుందన్న ప్రచారాన్ని కూడా బాబు తీసుకొచ్చారు. ఈ మాట‌ను ఆయ‌నే స్వ‌యం గా చెప్పారు. `` నేను వేసిన ఓటు నాకే ప‌డిందా?!`` అని అమాయ‌కంగా ప్ర‌శ్నించారు. నిజానికి రాష్ట్ర జ‌నాభాను ప‌క్క‌న‌పెట్టినా.. 175 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల్లో 174మందికి ఎక్క‌డా రాని సందేహం ఒక్క చంద్ర‌బాబుకు మాత్ర‌మే వ‌చ్చిందంటే.. ప్లాన్ బీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతోంది. ఏదేమైనా.. బాబు అసాధ్యుడ‌ని మ‌రోసారి అనిపించ‌క‌మాన‌దు!!


మరింత సమాచారం తెలుసుకోండి: