గురువారం రవిప్రకాశ్ ఫోర్జరీ కేసు అంశం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. అవును మరి టీవీ నైన్ సీఈవో రవి ప్రకాశ్ అంటే సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఎలక్ట్రానిక్ మీడియాను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి. మహా మహా మీడియా సామ్రాజ్యాలకు సాధ్యం కాని ఫీట్ ను చేసి చూపించినవాడు. 


తెలుగులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలా మీడియా హౌజులు ఉన్నాయి. వీటికి పటిష్టమైన వార్తా సేకరణ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ టీవీ నైన్ నెంబర్ వన్ ప్లేసును కదిలించలేకపోయాయన్నది నిజం. జనం కోరుకునే విధానంలో.. జనం బాషలో కాస్త మసాలా చేర్చి వార్తను అందించడంలోనే టీవీ9 విజయం ఉందని చెబుతారు. 

అలా నెంబర్ వన్ ప్లేసులో ఉండేందుకు కారణమైన వ్యక్తిపై కేసు వార్త వస్తే.. దాన్ని వార్తా కోణంలో చూడటం మరిచి వృత్తగతమైన విద్వేషాన్ని ప్రదర్శించాయన్న వాదన బాగా వినిపిస్తోంది. ప్రత్యేకించి దమ్మున్న ఛానల్‌ తో పాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఛానల్ ఈ ఇష్యూను బాగా హైలెట్ చేశాయి. 

అమ్మ దొంగా.. ఇన్నాళ్లకు దొరికావా.. నీ సంగతి చూస్తాం చూడు అన్న రేంజ్‌లో బ్రేకింగుల మీద బ్రేకింగులు వేసి.. వార్తలకు ఇంకొన్ని మసాలాలు అద్ది రవిప్రకాశ్ పై ఉన్న కోపమంతా తీర్చుకునే ప్రయత్నం చేశాయని మీడియా సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇక ముందు కూడా రవిప్రకాశ్ విచారణ వార్తలు ఇలాగే జోరుగా ఇస్తారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: