టీవీ నైన్.. తెలుగులో నెంబర్ వన్ ఛానల్. కానీ ఈ ఛానల్ పై కంప్లయింట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతిదాన్ని సెన్సేషన్ చేస్తారని.. టీఆర్పీల కోసం ఎంతకైనా తెగిస్తారని.. మొగుడూ పెళ్లాల గొడవలను అంతర్జాతీయ సమస్యల్లా చర్చిస్తారని.. అన్నింట్లోనూ ఓవర్  యాక్షన్ చేస్తారనీ.. అబ్బో.. ఈ ఫిర్యాదుల జాబితా చాంతాడంత.


కానీ.. ఎంత తిట్టినా.. ఎన్ని విమర్శలు చేసినా.. మళ్లీ టీవీ నైన్ చూడకుండా జనం ఉండలేరు. ఓవైపు తిడుతూనే మరోవైపు ఎగబడి మరీ అదే చానల్ చూస్తారు.. అదే టీవీ నైన్ విజయరహస్యం. కానీ.. రవిప్రకాశ్ ఫోర్జరీ కేసు మిగిలిన మీడియాలో బాగా హైలెట్ కావడంతో నెటిజన్లు టీవీనైన్‌ పై తమ ప్రతాపం చూపారు. 

నేరుగా రవిప్రకాశ్ పై ఘాటుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు కార్టూన్లు, మీమ్స్ వంటి చిత్రాలతో టీవీ నైన్ పై తమకు ఉన్న కోపాన్ని ప్రదర్శించారు. నీతులు చెప్పడమే కాదు.. ఆచరించి చూపాలని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు కట్నం తీసుకున్నవాడు గాడిద.. మరి ఫోర్జరీ చేసినవాడు.. అంటూ ప్రశ్నించారు. 

ఇంకొందరు.. నీ దాకా వస్తే కానీ తెలియలేదా.. అని కొందరు విమర్శిస్తే.. దొరికేంత వరకూ అందరూ నీలా దొరలే అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. రవిప్రకాశ్ కు సపోర్ట్ గా వచ్చిన కామెంట్స్ చాలా తక్కువగా ఉంటే.. మండిపడుతూ వచ్చినవే ఎక్కువ. రవిప్రకాశ్ కోసం యాంకర్ దేవి సముద్రంలో వెదుకుతున్నట్టు ఓ మీమ్ తయారు చేశారు మరికొందరు. మొత్తానికి ఈ కేసు వల్ల రవిప్రకాశ్‌ ను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: