వారం రోజుల క్రితం సంగారెడ్డి ప్ర‌భుత్వా ఆస్ప‌త్రిలో అదృశ్య‌మైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారి ఆచూకీ ల‌భించ‌డంతో క్షేమంగా త‌ల్లి ఒడికి చేర్చారు పోలీసులు. మెరుగైన చికిత్స కోసం ఆ పాప‌ను హైద‌రాబాద్‌లోని నీలోఫ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను సంగారెడ్డి ఎస్పీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 


సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి, మల్లేశం దంపతులకు ప్రభుత్వ ఆస్ప‌త్రిలో ఆడపిల్ల జన్మించింది. అయితే పాపను ఇంక్యూబేట‌ర్‌లో పెట్టి ఆరోగ్యం ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న తరుణంలో పాపకు పాలు పట్టాలని సిబ్బంది పిలిచారు. ఆ టైమ్‌లో మాధ‌వి అక్క‌డ లేరు.దీంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన బంగారు సంతోష్‌, శోభ దంప‌తులు త‌మ పాప‌నే అంటూ తీసుకుని వెళ్లిపోయారు. ఆ పాప‌ను తీసుకున్న నిందితులు ఎల్లారెడ్డికి చేరుకున్నారు. 


అలా ఆ మ‌హిళ వెళ్లిపోయాక ఇంత‌లోనే మాధ‌వి అక్క‌డ‌కు రావ‌డంతో చిన్నారి కిడ్నాప్ విష‌యం వెలుగులోకొచ్చింది. దీంతో బాధితురాలు మాధ‌వి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు విచార‌ణ చేప‌ట్టిన సంగారెడ్డి పోలీసులు అక్క‌డున్న సీసీ కెమెరా ఫుటేజీల‌ను క్ష‌ణ్ణంగా ప‌రిశీలించారు. సీసీపుటేజీ ఆధారంగా నిందితులు ఎల్లారెడ్డి వైపు వెళ్లిన‌ట్టు గుర్తించారు. 


శివనగర్‌కు చేరిన పోలీసుల బృందం అక్కడ వారి నుంచి చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతోష్, శోభలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల్లో చిన్నారి మిస్సింగ్ కేసును ఛేధించారు పోలీసులు వైద్యం నిమిత్తం చిన్నారి తల్లిదండ్రులకు ఎస్పీ రూ.10 వేల నగదు అందజేశారు. 


ఇదిలా ఉంటే మ‌రోవైపు కూత‌రు సంతోషంగా ఉండాల‌న్న కోరిక‌తోనే తాము సంగారెడ్డి ఆస్ప‌త్రి నుంచి చిన్నారిని ఎత్తుకెళ్లిన‌ట్టు చెప్పారు నిందితులు సంతోష్, శోభ దంప‌తులు. అయితే త‌మ కూతురుకు రెండు సార్లు పిల్ల‌లు పుట్టి చ‌నిపోయారు. అందుకే బిడ్డ లేని లోటు తీర్చేందుకే ఆ పాపను ఎత్తుకెళ్లిన‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌మ కుమ‌ర్తెకు కూతురు పుట్టింద‌ని న‌మ్మించేందుకు చూసిన‌ట్లు పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: