తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌రోమారు మీడియా సంస్థ‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న మీడియా సంస్థ‌ల‌పై క‌త్తి దూస్తున్న ఆయ‌న తాజాగా, ఆంధ్ర‌జ్యోతిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న‌ట్లుగా పేర్కొంటున్నారు. తాజాగా, విద్యుత్ కోత‌ల‌విష‌యంలో ఆంధ్ర‌జ్యోతి రాసిన వార్త‌పై ఏకంగా ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విలేక‌రుల స‌మావేశం పెట్ట‌డం దీనికి నిద‌ర్శ‌న‌మంటున్నారు.


సంక్షోభంలో తెలంగాణ విద్యుత్ రంగం అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో క‌థనం ప్రచురించింది. దీనిపై ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విలేక‌రుల స‌మావేశంలో భ‌గ్గుమ‌న్నారు. ``విద్యుత్ రంగంలో సంక్షోభం కాదు...మినిమం నాలెడ్జ్ లేకుండా ఫ్రంట్ పేజీలో అచ్చొత్తిన ఆంధ్రజ్యోతి అక్షరాల్లో అడుగడుగునా సంక్షోభం ఉంది. విద్యుత్ రంగం మీద రాధాకృష్ణ పత్రిక రాసిన ప్రతీ అక్షరం అబద్ధం. అసత్య ప్రచారం. ఎందుకంటే, ఒక పసికూన రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని చూసి దేశమే అబ్బురపడింది. రాష్ట్రం ఏర్పాటైన ఆరు నెలల్లోనే కరెంటు కష్టాలను అధిగమించి, ఈ నేలకు వెలుగు రేఖలు పంచిన తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకున్నాయి. ఈ విషయం తెలిసీ ఆంధ్రజ్యోతి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది.`` అంటూ మండిప‌డ్డారు. 


``అబద్ధాల ఆంధ్రజ్యోతి రాసినట్టు ఎక్కడా లోడ్ షెడ్డింగ్ గానీ, లో-ఓల్టేజ్ సమస్య గానీ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వ్యవసాయ సీజన్ అయిపోయింది కాబట్టి, కాస్త డిమాండ్ తగ్గిన మాట వాస్తవం. అంతేగానీ ఉత్పత్తి ఆగలేదు. సంక్షోభమూ రాలేదు. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అవసరమైనప్పుడు వాడుకునేలా బ్యాంకింగ్ చేసుకోవడానికి జెన్‌కో ఇటీవలే టెండర్లు కూడా పిలిచింది. ఇక ఎన్టీపీసీ దగ్గర్నుంచి  థ్రెట్‌ ఉందన్న రాతలు కూడా పచ్చి అబద్ధాలు. ఎన్టీపీసీ గానీ మరొకరి నుంచి గానీ జెన్‌కోకు ఎలాంటి హెచ్చరికలు రాలేదు. ఇటీవలే ఎన్టీపీసీకి రూ.1500 కోట్లు చెల్లించారు. అలాంటప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు ఎలా వస్తాయో ఆంధ్రజ్యోతికే తెలియాలి`` అన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు. ``గత నాలుగేళ్లలో సబ్సిడీలే కాకుండా అదనంగా మరో రూ.7,160 కోట్లు విద్యుత్ అవసరాల కోసం ఇచ్చింది. ఉదయ్ స్కీంలో భాగంగా 7 వేల 900 కోట్ల డిస్కం లోన్ కూడా ప్రభుత్వం తీసుకుంది. దానివల్ల డిస్కంలకు ప్రతీ ఏడాది రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వడ్డీ భారం తప్పింది. బకాయిల చెల్లింపు విషయంలో కూడా ఆంధ్రజ్యోతి అబద్దపు రాతలే రాసింది. సాధారణంగా ఈ నెలకు సంబంధించిన పవర్ బిల్లింగ్ వచ్చే నెలలో అవుతుంది. రెండు నెలల తర్వాతే ఆ బిల్లు అమౌంట్ జెన్‌కోకు చేరుతుంది. విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా సేమ్. ఈ నెల బిల్లు అయిన తర్వాత, రెండో నెలలో బిల్లును పరిశీలిస్తారు. ఆ తర్వాతి నెలలో బిల్లులు చెల్లిస్తుంటారు. చెల్లించాల్సిన ప్రతీ బకాయికి ఒక డ్యూ డేట్ ఉంటుంది. దాని ప్రకారమే చెల్లింపులు జరుగుతుంటాయి. జెన్‌కో చెల్లించాల్సింది, జెన్‌కోకు రావాల్సింది- ఎలా చూసినా వినియోగదారుల దగ్గర్నుంచి విద్యుత్ సంస్థలకు రావాల్సిన మొత్తమే ఎక్కువంటున్నారు ప్రభాకర్ రావు. అలాంటప్పుడు సంక్షోభానికి ఛాన్స్ ఎక్కడుంటుంది``అని ఆయన ఆంధ్రజ్యోతిని ప్రశ్నించారు.


కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌న్నిహితుడనే పేరున్న ప్ర‌భాక‌ర్‌రావు తాజాగా ఈ స్థాయిలో ఆంధ్ర‌జ్యోతిపై విరుచుకుప‌డ‌టంలో తేల్చుకోవ‌డ‌మనే అంశం ఉన్న‌ట్లుగా చెప్తున్నారు. అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌ర్భంగా మొద‌లైన వార్‌లో ఇది తారాస్థాయికి చేరిన ఎపిసోడ్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: