రాయపాటి కుటుంబం వైసిపిలో చేరుతోందా ? ఇపుడిదే అంశం జిల్లాలోని తెలుగుదేశంపార్టీ నేతలను పట్టి కుదిపేస్తోంది. పోలింగ్ అయిపోయి 23వ తేదీన జరిగే కౌంటింగ్ పై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో రాయపాటి శ్రీనివాస్ కొడుకు మోహనసాయికృష్ణ చేసిన వ్యాఖ్యలతో జిల్లా పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

 

ప్రత్యేకహోదా విషయంలో అన్నీ రాజకీయ పార్టీలు జనాలను మోసం చేశాయంటూ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్, టిడిపి ఏ1, ఏ2 అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ3, ఏ4 గా జనసేన, బిజెపిలుంటాయని కూడా అన్నారు. నాలుగు పార్టీలపైన నిప్పులు చెరిగిన మోహన్ వైసిపిని మాత్రం పల్లెత్తు మాటనకపోవటం గమనార్హం. తాను ఏ పార్టీతోను సంబంధం లేకుండాను మాట్లాడినట్లు చెప్పినా తండ్రి శ్రీనివాస్, పెద్దనాన్న రాయపాటి సాంబశివరావు టిడిపిలో ఉన్న విషయం అందిరికీ తెలిసిందే.

 

మొన్నటి ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు నరసరావుపేట ఎంపిగా టిడిపి నుండి పోటి చేశారు. గెలుపోటములపై అన్నీ నియోజకవర్గాల్లాగే ఇక్కడ కూడా సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. అసలు మొన్నటి ఎన్నికల్లో రాయపాటికి చివరి నిముషం వరకూ టికెట్ ఇస్తారో లేదో కూడా తేల్చి చెప్పలేదు చంద్రబాబు. దాంతో మొత్తం కుటుంబమంతా చంద్రబాబుపై మండిపోతున్నారు.

 

నిజానికి గుంటూరు జిల్లా రాజకీయాలను తనదైన శైలిలో శాసించిన కుటుంబాల్లో రాయపాటి కుంటుంబం కూడా ఒకటి. పోంలింగ్ అయిపోయి అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో రాయపాటి మోహన్ సాయికృష్ణ చేసిన వ్యాఖ్యలతో  రాయపాటి కుటుంబం వైసిపిలో చేరుతోందనే చర్చ జోరందుకుంది. మరి వాస్తవమేంటో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: