చంద్రబాబునాయుడు సమీక్షలంటేనే తమ్ముళ్ళు హడలిపోతున్నారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడు పడితే అపుడే చంద్రబాబు సమీక్షలంటుంటారు.  అమరావతిలో చంద్రబాబు నిర్వహించే సమీక్షకు ఒకసారి వచ్చి పోవాలంటే చాలా జిల్లాలకు చెందిన  తమ్ముళ్ళ జేబులు గుల్లయిపోతున్నాయట.

 

ఉత్తరాంధ్ర, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుండి సమీక్షలకు హాజరుకావాలంటే వేలాది రూపాయలు ఖర్చులు పెట్టుకోక తప్పటం లేదు. అందుకే చంద్రబాబు సమీక్షలంటేనే భయపడిపోతున్నారు. మరీ ఛాదస్తం ఎక్కువైపోయిన చంద్రబాబు పోలింగ్ జరిగిన తర్వాత కనీసం మూడు నాలుగు సార్లైనా సమీక్షలు చేసుంటారు.

 

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అయిపోయిన పెళ్ళికి భాజాలు లాగ ఎన్నిసార్లు సమీక్షలు చేసినా విషయం మాత్రం ఒకటే. ఓటరు తీర్పు ఈవిఎంలలో నిక్షిప్తమైపోయింది. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నిసార్లు సమీక్షలు చేసినా, ఎన్ని మార్గాల్లో సమాచారం సేకరించినా తీర్పులో మార్పేమీ ఉండదు. అయినా సరే సమీక్షల పేరుతో నేతలను చంద్రబాబు చావకొడుతునే ఉన్నారు. అందుకే సమీక్షలంటే భయపడిపోతున్నారు.

 

తాజాగా జరిగిన ప్రహసనాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు.  శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల నేతలతో సమీక్ష పెట్టారు. శ్రీకాకుళం ఎంఎల్ఏ గుండ లక్ష్మీదేవితో పాటు నేతల్లో ఎవరూ హాజరుకాలేదు. దగ్గర బంధువుల్లో ఎవరో చనిపోయారని ఎంఎల్ఏ హాజరుకాలేదు. మరి నేతలు కూడా ఎందుకు మానేశారు ? ఎందుకంటే ఖర్చులకు భయపడే. రెండో కారణం ఎన్నిసార్లు సమీక్షలు చేసినా ఉపయోగం లేదని తెలియటమే.

 

సమీక్షల సమస్య ఒక్క శ్రీకాకుళంకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతీ నియోజకవర్గంలోను ఇదే సమస్య. ఓటరు తీర్పేదో రిజర్వయిపోయింది. 23వ తేదీన ఫలితం రాబోతోంది. అంత వరకూ వెయిట్ చేస్తే సరిపోతుంది. గెలిస్తే ఎలాగూ చంద్రబాబు సుత్తి భరించక తప్పదు. అదే ఓడిపోతే ఎక్కడ ఫెయిలయ్యామో అప్పుడు సమీక్షించుకున్నా అర్ధముంటుంది కదా అన్నది తమ్ముళ్ళ వాదన. తమ్ముళ్ళ వాదనను, బాధను అర్ధం చేసుకునేట్లయితే ఆక్కడున్నది చంద్రబాబు ఎందుకవుతారు ?


మరింత సమాచారం తెలుసుకోండి: