టీవీ9లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. టీవీ9 సీఈవోగా సుప‌రిచితుడు అయిన‌ రవిప్రకాశ్ శ‌కం ఆ ఛాన‌ల్‌లో ముగిసింది. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీచేసి, ఆయన కంపెనీకి రాజీనామా చేసినట్టు పాతతేదీలతో పత్రాలు సృష్టించారంటూ ఏబీసీఎల్‌ను కొత్తగా టేకోవర్‌చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పీ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు 
ఎపిసోడ్ కీల‌క మ‌లుపులు తిరిగింది. తాజాగా జ‌రిగిన‌ స‌మావేశంలో నూత‌న సీఈఓను నియమించారు. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును ఏబీసీఎల్ డైరెక్టర్స్ బోర్డు నియమించింది.


సంత‌కాల ఫోర్జ‌రీ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొ న్న ప్రకారం.. వీ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీచేసి తప్పుడు పత్రాలు సృష్టించారని పీ కౌశిక్‌రావు ఏప్రిల్ 24న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వీ రవిప్రకాశ్, సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తి ఇతరులు తప్పు డు పత్రాలు సృష్టించారని ఏప్రిల్ 30న కౌశిక్‌రావు మరో ఫిర్యాదు ఇచ్చారు. అయితే, తానేమీ త‌ప్పు చేయ‌లేద‌ని, స‌త్యం గెలుస్తుంద‌ని ర‌విప్ర‌కాశ్ వివ‌ర‌ణ ఇచ్చారు. సీఈఓగా టీవీ9 నుంచి మాట్లాడుతున్నాన‌ని ప్ర‌క‌టించారు.


ఇలా, కీల‌క ప‌రిణామాలు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే, టీవీ9లో రవి ప్రకాశ్ ప్రస్థానం ముగిసింది. శుక్ర‌వారం సమావేశమైన ABCL డైరెక్టర్స్ బోర్డు కొత్త టీమ్‌ని నియమించింది. టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించారు. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ABCL డైరెక్టర్స్ బోర్డు ఆయనకు అదనంగా టీవీ9 తెలుగు బాధ్యతలను అప్పజెప్పింది. గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయన్ను టీవీ9 సీవోవోగా నియమిస్తూ ABCL డైరెక్టర్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో టీవీ9లో ర‌విప్ర‌కాశ్ ప్ర‌స్తానం ముగిసిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 


కాగా, క‌న్న‌డ నేల‌కు చెందిన మిశ్రాకు ప‌ద‌వీ బాధ్య‌త‌లు క‌ల్పించ‌డం వెనుక టీవీ9 పెద్ద‌ల వ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. తెలుగు వ్య‌క్తుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే...తిరిగి ఊహించ‌ని ప‌రిణామాలు సంభ‌వించ‌వ‌చ్చ‌ని భావించి ఈ మేర‌కు ఇప్ప‌టికే ఛాన‌ల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న క‌న్న‌డ నేల‌కు చెందిన వ్య‌క్తికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: