అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ సంస్థ పొగ‌రు అణిగింది. భార‌తీయుల ఆందోళ‌న గెలిచింది. మ‌న‌ ఆలుగడ్డపై రైతులపై జులుం చేసిన పెప్సికో తోక‌ముడిచింది. పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కోర్టులో కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ రైతులు పండించే బంగాళదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని పెప్సీ, లేస్ చిప్స్ వంటి ఉత్పత్తులు తయారుచేసే ఈ కంపెనీ వాదించింది. అయితే, రైతులే కాకుండా భారతీయుల నుంచి బలంగా న్యాయపోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది.


గుజరాత్ కి చెందిన 9 మంది రైతులు ఒక తరహా బంగాళదుంప పేటెంట్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పెప్సికో కేసులు పెట్టింది. తమ లేస్ చిప్స్ కోసం ఉపయోగించే ఎఫ్ సి5  తరహా ఆలుగడ్డలకు పేటెంట్ తీసుకున్నామని, రైతులు అక్రమంగా పండిస్తున్నారని ఆరోపించింది.పెప్సీకో కేస్ పెట్టడంపై దేశవ్యాప్తంగా ప్రజలు రైతులకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో కూడా పెప్సికో చర్యను తీవ్రంగా విమర్శించారు. చివరికి పెప్సికో వెనుకంజ వేయాల్సి వచ్చింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను కంపెనీ బేషరతుగా ఉపసంహరించుకున్నట్టు రైతుల తరఫు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ తెలిపారు. దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు.


కాగా, పెప్సీ కోలా, లేస్ చిప్స్ తయారుచేసే పెప్సీకో అమెరికాలోని హెడ్ క్వార్టర్, ఆసియా పసిఫిక్ ప్రాంతం కార్యాలయం రైతులపై చట్టపరమైన కేసు నమోదు చేసిన భారత శాఖ చర్యపై విచారం వ్యక్తం చేసింది. కాగా, ఇది భార‌తీయులు స‌మిష్టిగా సాధించిన విజ‌య‌మ‌ని, మ‌న‌కు ప‌ట్టెడు అన్నం పెట్టే రైతును గెలిపించిన సంద‌ర్భమ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: