జాతీయ స్ధాయిలో చంద్రబాబునాయుడును జాకీ లేసి లేపటానికి జాతి మీడియా ఎంత అవస్తలు పడుతోందో.  జాతీయస్ధాయిలో విపక్షాల్లో ఐక్యతకు చంద్రబాబే కేంద్ర బిందువట. ఎలా కేంద్రబిందువుగా మారారో మాత్రం చెప్పలేదు. పోనీ నరేంద్రమోడికి వ్యతిరేకంగా ఏ ఇద్దరినైనా కలపగలిగారా అంటే అదీ చెప్పలేదు. పటిష్ఠ కూటమికి చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సదరు మీడియా ఊదరగొట్టమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి చంద్రబాబు చెబితే వినేందుకు జాతయస్ధాయిలోని ఏ నేత కూడా సిద్ధంగా లేరు. అదే సమయంలో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీలు పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు పాత్ర ఏమాత్రం లేదు. పై రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఒక తన్ను తన్ని బయటకు తరిమేశాయి. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్న పొత్తుకు ససేమిరా అన్నాయి. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అపుడేం చేస్తున్నట్లు ?

 

అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ తో పొత్తులేదు.  రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగినా సాధ్యం కాలేదు. మరి చంద్రబాబు ఇద్దరి మధ్యా పొత్తులు కుదిర్చి ఉండొచ్చు కదా ? ఎందుకు చేయలేదు ? ఇక పశ్చిమబెంగాల్ సంగతి చూస్తే రాహూల్ గాంధి అంటేనే మమతాబెనర్జీ మండిపడుతున్నారు. రాహూల్ ఆధిపత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదంటున్నారు.

 

ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ తో కాంగ్రెస్ పొత్తులను కుదర్చలేని చంద్రబాబు విపక్ష కూటమికి కేంద్రబిందువట. పోనీ చంద్రబాబు వల్ల యూపిఏ కూటమిలోకి కొత్త పార్టీలేమైనా చేరాయా అంటే అదీ లేదు.  తమిళనాడులోని డిఎంకె, కర్నాటకలోని జెడిఎస్ ఎలాగూ యూపిఏలోనే ఉన్నాయి. సమావేశాల నిర్వహణలో చొరవ చూపిస్తున్నారట. అందరినీ ఏకతాటిపైకి తేవటం కోసం చంద్రబాబు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు ఇంత వరకు.

 

రేపటి కౌంటింగ్ లో టిడిపి ఓడిపోతే జాతీయస్ధాయిలో చంద్రబాబును పట్టించుకునే వారే ఉండరన్నది వాస్తవం.  ఆ విషయం చంద్రబాబుకు కూడా అర్ధమవుతోంది. అందుకనే పిలిచినా పిలవకపోయినా తనంతట తానే చొరవ తీసుకుని చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్ళటం, ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. రేపు వైసిపి మంచి మెజారిటీతో గెలిస్తే ఇపుడు చంద్రబాబు ఎవరి దగ్గరకు వెళుతున్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు క్యూ కడతారనటంలో సందేహమే లేదు. అప్పుడు ఇదే జాతి మీడియా ఏం చేస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: