గుంటూరు జిల్లాలో వైసిపికి కంచుకోటగా ఉన్న ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసిపి  సవాళ్లు రువ్వుతోంది. లోక్‌స‌భ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ సీట్లలో టిడిపి, వైసిపి అభ్యర్థుల గెలుపోటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. గెలుపోటములపై కంటే వైసిపికి వచ్చే మెజార్టీ పైనే అక్కడ ఎక్కువగా పందేలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బిజెపి అభ్యర్థి నలబోతు వెంకటరావుపై 16 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ టిడిపి బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ అరవింద బాబును రంగంలోకి దింపింది. ఇక నరసరావుపేట పట్టణంలో వచ్చే మెజార్టీ అక్కడ అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది. 


రొంపిచర్ల మండలంలో వైసీపీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీకి ఆరు వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. ఇక నరసరావుపేట రూరల్ మండలంలోనూ గతంలో వైసీపీకే మెజార్టీ రాగా ఈ సారి తమకే ఎడ్జ్‌ ఉందని టిడిపి భావిస్తోంది. ఈ ఎన్నికల్లో  బీసీ కార్డు ప్రయోగించినా ఎన్నికల చివరిలో అభ్యర్థి పేరు ప్రకటించడంతో ఆయన జనంలోకి వెళ్లేందుకు సరైన సమయం లేకపోవడం మైనస్ అయ్యింది. ఇక చివరిలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వైసీపీతో పోలిస్తే టిడిపి వెనుకబడినట్టు స్పష్టంగా కనిపించింది. గెలుపు తమదేనని... తమకు వచ్చే మెజార్టీ ముఖ్యమని ధీమాతో ఉన్న వైసిపి సానుభూతిపరులు గెలుపు విష‌యంలో రూపాయికి నాలుగు రూపాయ‌లు ఇస్తామంటూ హెచ్చు పందానికి దిగుతున్నారు.  


వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తే చాలు... అదే టిడిపి అభ్యర్థి అరవింద బాబు గెలిస్తే వైసిపి వాళ్ళు ఏకంగా నాలుగు లక్షలు ఇస్తామంటున్నారు. పోలింగ్ ముగిశాక లక్షకు లక్షన్నర నుంచి ప్రారంభమైన ఈ పందెం ఆ తర్వాత రెండు లక్షలు, మూడు లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు ఇచ్చే వరకు వెళ్ళింది.  వైసీపీ ఖాతాలో ఖ‌చ్చితంగా పడే సీట్లలో నరసరావుపేట ఫ‌స్ట్ లిస్టులోనే ఉంటుంద‌ని ఆ పార్టీ వాళ్లు భావిస్తుండడంమే ఇంత భారీ ఎత్తున బెట్టింగ్ కు కారణంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: