చంద్రబాబునాయుడు పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారో ఆయనకు మద్దతిచ్చే మీడియానే స్పష్టం చేసింది. రాష్ట్రం అప్పులో ఉందని, కట్టుబట్టలతో తరిమేశారని నిత్యం చెప్పుకునే చంద్రబాబు వందలాది కోట్ల రూపాయలు వృధా చేసినట్లు తేలిపోయింది.  అధికారిక సమీక్షలని, సదస్సులు నిర్వహణే కాకుండా ఆ సమయంలో భోజనాల పేరుతో విపరీతమైన, అనవసరమైన ఖర్చులు జరిగినట్లు సదరు మీడియాకు ఇపుడు తెలిసింది.

 

నిజానికి చంద్రబాబు డాబు, తర్పానికే వందల కోట్ల రూపాయలు ఖర్చయింది. అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యేక విమానాలు, ప్రతీ జిల్లాలోను సదస్సులు, ఒకటికి పదిసార్లు ఒకే అంశంపై సమీక్షల నిర్వహణ పేరుతో వందల కోట్లు వృధా చేశారు. అడ్డుగోలు రాష్ట్ర విభజనకు నిరసనగా నవనిర్మాణ దీక్షల పేరుతోను ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్రమోడికి వ్యతిరేకంగా ధర్మపోరాట దీక్షల పేరుతో సుమారుగా రూ 100 కోట్లు వృధా చేసుంటారు. ఇక ప్రత్యేక విమానాల ఖర్చే ఐదేళ్ళల్లో సుమారు రూ 115 కోట్లని మొన్ననే లెక్క తేలింది.

 

అదే సమయంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో జరిగిన వేల కోట్ల రూపాయలది మరో ప్రహసనం. సుమారు రూ 200 కోట్లతో పూర్తయ్యే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాల నాసిరకం నిర్మాణాలకు సుమారు రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టారు. శంకుస్ధాపనల పేరుతో  సుమారు రూ. 300 కోట్లు వ్యయం చేశారు.

 

చంద్రబాబు మీడియా లెక్కల ప్రకారమే ఎన్నికలకు ముందు సామాజిక పెంషన్లు, నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ పథకాల క్రింద వేలాది కోట్లు ఖర్చ చేశారట. అంటే ఇదంతా ఓటుకునోటు లాంటిదే అని అర్ధమైపోయింది. ప్రభుత్వానికి వచ్చే రూ. 60 వేల కోట్ల ఆదాయంలో సుమారు రూ. 54 వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు తదితరాలకే సరిపోతోందని పాపం సదరు మీడియా ఇపుడు బోలెడు ఆందోళన వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మారితే కానీ చంద్రబాబు హయాంలో జరిగిన వృధా ఖర్చులెంతో బయటపడదు.

 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇలాంటి దండగమారి ఖర్చులను లెక్కెస్తే ఎన్ని వేల కోట్లకు లెక్కలు తేలుతాయో తెలీదు. అంటే అధికారంలోకి రాబోయేది వైసిపినే అన్న ఉద్దేశ్యంతో ముందుజాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఉన్నతాధికారులు ఓ నోట్ తయారు చేస్తున్నారట. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి సమర్పించటానికి నోట్ రెడీ చేస్తున్నట్లుగా సదరు మీడియా చెప్పటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: