ఏపీలో ఈ సారి ప‌వ‌న్ అభిమానులు, కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు గ్లాస్ దెబ్బ‌కు విల‌విల్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. 2009లో ప్ర‌జారాజ్యం ఎంట్రీతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు సైతం మూడో స్థానంతో స‌రిపెట్టుకుని.. త‌మ కెరీర్‌లోనే ఎన్న‌డూ ఎదుర్కోనంత ఘోర‌మైన ప‌ర‌జాయాన్ని చ‌విచూశారు. ఇక ఇప్పుడు జ‌న‌సేన దెబ్బ‌తో ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో కొంద‌రు సీనియ‌ర్లు మ‌ళ్లీ అదే ఘోర ప‌రాజ‌యం మూట‌క‌ట్టుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. గోదావ‌రి తీర‌న ఉన్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ఇప్పుడు జ‌న‌సేన గ్లాస్ దెబ్బ‌కు విల‌విల్లాడే ప‌రిస్థితి.


2009లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు క‌డియం నియోజ‌క‌వ‌ర్గం కాస్తా పేరు మారి కొంత కార్పొరేష‌న్‌లోని డివిజ‌న్ల‌తో పాటు క‌డియం, రూర‌ల్ మండ‌లాల‌తో కొత్త నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ రెండుసార్లు ఎన్నిక‌లు జ‌రిగితే రెండుసార్లూ కూడా టీడీపీయే గెలిచింది. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి బుచ్చ‌య్య తొమ్మిదో సారి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో 1983 నుంచి 2009 వ‌ర‌కు వ‌రుస‌గా పోటీ చేసిన ఆయ‌న నాలుగుసార్లు గెలిచి... మూడు సార్లు ఓడారు. మ‌ధ్య‌లో ఓ సారి మంత్రిగా కూడా ప‌నిచేశారు.


ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మారారు. ఐదోసారి గెలిచిన బుచ్చ‌య్య ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి ఆశించి... అది ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర‌మైన నిర‌స‌న గ‌ళం వినిపించారు. మ‌ధ్య‌లో రాజీనామా చేస్తాన‌ని అల‌క‌బూని ఆ త‌ర్వాత త‌గ్గారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నుంచి మూడు పార్టీల త‌ర‌పున ముగ్గురు ఉద్దండులు అయిన అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన ఆకుల వీర్రాజు, జ‌న‌సేన నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బ‌ల‌మైన నేత‌లుగా పోటీలో ఉన్నారు.


ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మూడు పార్టీల నుంచి ముగ్గురు బ‌ల‌మైన నేత‌లు బ‌రిలో ఉండ‌డంతో చాలా ట‌ఫ్ పైట్ ఉంది. ఇక్క‌డ కులాల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. నియోజ‌క‌వ‌ర్గంలో 52 వేల మంది కాపు ఓట‌ర్లు ఉన్నారు. ఆకుల వీర్రాజు, దుర్గేష్ ఇద్ద‌రూ కాపు వ‌ర్గానికే చెందిన వారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన బుచ్చ‌య్య క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారు. క‌మ్మ వ‌ర్గం ఓట్లు 16 వేల వ‌ర‌కు ఉన్నాయి. ఇక బీసీల్లో శెట్టిబ‌లిజ‌లు 36 వేలు, ఎస్సీలు 23 వేల ఓట్లు ఉన్నాయి. 


ఇక గ‌త ఎన్నిక‌ల్లో బుచ్చ‌య్య గెల‌వ‌డానికి కార‌ణం జ‌న‌సేన స‌పోర్ట్‌, క‌మ్మ‌లు, శెట్టిబ‌లిజ‌లు వ‌న్‌సైడ్‌గా ఓట్లేయ‌డం.. కాని ఈ సారి కాపుల ఓట్లు ఆయ‌న‌కు ప‌డే ప‌రిస్థితి లేదు. కాపులు వైసీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కే ఓట్లేశారు. శెట్టిబ‌లిజ‌లు కూడా ఈ సారి మూడు పార్టీల మ‌ధ్య చీలిపోయారు. ఇక ఎస్సీలు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ లెక్క‌న చూస్తే టీడీపీ ఓటు బ్యాంకును ఇక్క‌డ జ‌న‌సేన భారీగా చీల్చ‌డంతో బుచ్చ‌య్య టెన్ష‌న్‌లో ఉండ‌గా... వైసీపీ గెలుపుపై ధీమాతో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోతే బుచ్చ‌య్య పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిన‌ట్టే..!


మరింత సమాచారం తెలుసుకోండి: