ఆయనో ఐఏఎస్ అధికారి. ఐదేళ్ళుగా కీలక శాఖలో పెత్తనం చెలాయిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి. అందులోను చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహిత అధికారిగా ప్రచారంలో ఉన్నారు. ఆయనే శశిభూషణ్ కుమార్. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జలవనరుల శాఖ అంటేనే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పోలవరం, పట్టిసీమ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆయన పరిధిలోకే వస్తాయి.

 

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఆయనింట్లో ఈమధ్య చిన్న దొంగతనం ఒకటి జరిగింది లేండి. ఏదో లక్షన్నర రూపాయల నగదు,  రూ. 6.5 లక్షల విలువైన బంగారు నగలు దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. నిజానికి లక్షన్నర రూపాయల డబ్బు దొంగతనం జరిగిందంటే చాలా చిన్న విషయమే చెప్పాలి.

 

అదే విషయాన్ని శశిభూషణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదులో  చెప్పారట. అయితే,  శశిభూషన్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారట. పై స్ధాయి నుండి ఒకటే ఒత్తిళ్ళు పెట్టిస్తున్నారట. దాంతో విషయం ఏమిటా అని ఆరాతీశారు గట్టిగా పోలీసులు. దాంతో విషయం బయటకు వచ్చింది. పోయిన డబ్బు ఫిర్యాదులో చెప్పినట్లుగా లక్షన్నర కాదట. ఏకంగా రూ 84 లక్షల రూపాయల డబ్బు, రూ 26 లక్షల విలువైన బంగారు నగలని మెల్లిగా బయటకు వచ్చింది.

 

దాంతో పోలీసుల్లో కూడా చురుకుపుట్టి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. శశిభూషణ్ ఇంట్లో దొంగతనం చేసింది ఆయనింట్లో ఉండే బీహార్ కు చెందిన సెక్యూరిటీ గార్డే అని తేలింది. సరే వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. నానా అవస్తలు పడి ఆ సెక్యూరిటీ గార్డును పట్టుకుని విజయవాడకు తెచ్చారు. ఇక్కడ విచారణ పేరుతో పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ చూపించారట. దాంతో గార్డు బయటపెట్టిన విషయాలు విన్న పోలీసులే ఆశ్చర్యపోయారట.

 

ఇంతకీ గార్డు చెప్పిందేమిటంటే తాను దొంగతనం చేసింది రూ 86 లక్షలు కాదని నాలుగు కోట్ల రూపాయలని చెప్పారట. మరి బంగారం ఎంతన్న విషయం బయటకు రాలేదు. ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఎలా ఉందన్నదే అర్ధం కావటం లేదు. ఏదో రాజకీయా నేతల ఇంట్లోనో, కాంట్రాక్టర్ల దగ్గరో అంత డబ్బుందంటే అది వేరే సంగతి. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంట్లోనే నాలుగు కోట్ల రూపాయలు దొరికితే దొరకని డబ్బు ఇంకెంతుందో అని అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: