పాపం.. ఆ రెడ్డి గారు గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేశారు. చదువు లేకపోయినా కార్మిక నేతగా ఎదిగి.. క్రమంగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కాకపోతే పేరులో రెడ్డి కనిపించలేదు. ఆయనే అంజయ్య. చాలా మందికి అంజయ్య రెడ్డి అనే విషయం తెలియదు. 


ఈ విషయం తెలియక పోవడం తప్పు కాదు.. కానీ ఆయన కులం తెలియకుండానే ఆయన్ని మరో కులానికి ఆపాదించడం ముమ్మాటికీ తప్పే.. కానీ ఆ తప్పు చేస్తోంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత టి.అంజయ్యను నరేంద్రమోడీ పదేపదే దళితుడు అని ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్ ను విమర్శించేందుకు మోడీ.. అంజయ్యను వాడుకుంటున్నారు. దళితుడు  అయినందుకే అంజయ్యను అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో అవమానించారని పార్లమెంటు సాక్షిగా మోదీ వ్యాఖ్యానించారు. తాజాగా గురువారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయం  ప్రస్తావించారు. 

మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అంజయ్య మనవడు, టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి అభిషేక్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, దళితుడు కాదని పలుమార్లు వివరణ ఇచ్చినా..ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అన్ని వివరాలతో మోదీకి లేఖ రాస్తానని అభిషేక్‌రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో దళితుల ఓట్లు పొందడానికే మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: