ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు కొండా సురేఖ దంప‌తులు రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన సంద‌ర్భంలో ఉన్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన  ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అయితే కేసీఆర్ ఆమెను కరుణించలేదు. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ నిప్పులు చెరిగారు. ఢిల్లీకి వెళ్లి త‌న భ‌ర్త కొండా ముర‌ళితో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. అయితే, ఓట‌మి పాల‌య్యారు.


ప‌ర‌కాల నుంచి ఓడిపోయిన సురేఖ రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్నారు. తాజాగా కొండా దంప‌తుల‌కు అవ‌కాశం ద‌క్కింద‌ని అంటున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి అవ‌కాశం ద‌క్కి గెలిస్తే...వారి పొలిటిక‌ల్ కెరీర్ ముందుకు సాగుతుంద‌ని చెప్తున్నారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నుంచి మండలికి ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావులు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ ఎమ్మెల్సీ స్థానాల‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరిన కొండా.. ఆ సమయంలోనే తన సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు.

మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు. కాగా, కాంగ్రెస్ త‌ర‌ఫున‌ వ‌రంగ‌ల్ నుంచి కొండా ముర‌ళి పేరు ప‌రిశీల‌న‌లో ఉండ‌గా.. మిగిలిన రెండు స్థానాల‌కు ప‌లువురు సీనియ‌ర్ల పేర్లు ప‌రిశీల‌నలో ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: