తెలుగు టీవీ జర్నలిజం దిగ్గజం రవిప్రకాశ్ పరారీలో ఉన్నారా..? వినడానికి కాస్త చేదుగా ఉన్నా వాస్తవం ఇదే. నేనే టీవీ నైన్ సీఈవోను.. నన్ను ఎవరు అరెస్టు చేయడం లేదు. పుకార్లు నమ్మొద్దంటూ మూడు రోజుల క్రితం టీవీ నైన్ తెరపై కనిపించిన రవిప్రకాశ్ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. 


ప్రస్తుతం రవిప్రకాశ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఆయన ఎక్కడికెళ్లాలో తమకు కూడా తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి అంత దర్జాగా లైవ్ లో భరోసా ఇచ్చిన రవిప్రకాశ్ ఎందుకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లారన్నది అర్థం కాని విషయం. 

ఫోర్జరీ కేసు సహా ఇతర అభియోగాలు ఉండటంతో సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం, సైబర్ క్రైమ్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కనిపించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించారు. రవిప్రకాశ్ విచారణకు సహకరిస్తారని, ఇందుకోసం పది రోజుల గడువు కావాలని రవిప్రకాశ్ తరపు న్యాయవాది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు తెలుస్తోంది. 

రవిప్రకాశ్ ఎక్కడికి వెళ్లారన్న విషయం తమకు కూడా తెలియదని టీవీ9 సిబ్బది కూడా దర్యాప్తు అధికారులకు తెలిపారు. ఇదే కేసులో నటుడు శివాజీకి మరోమారు నోటీసులు పంపనున్నట్టు హైదరాబాద్ సీపీ సజ్జనాత్ తెలిపారు. ఈసారి కూడా హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: