ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఫలితాల ప్రకటన తీరుతెన్నుల విశేషాలు ఓ సారి చూద్దాం.. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో అనంతపురం జిల్లాలో తొలి ఫలితం పుట్టపర్తి నియోజకర్గానిదే వెలువడుతుందని తెలుస్తోంది. 


ఓట్ల సంఖ్యను బట్టే ఈ ఫలితాల వెల్లడికి ఛాన్స్ ఉంటుంది. పుట్టపర్తిలోనే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ఆఖరున చివర్లో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న జరుగనున్న కౌంటింగ్‌ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి జేఎన్‌టీయూలోశిక్షణ ప్రారంభమైంది.

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు దాని పరిధిలోని అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలకు జేఎన్‌టీయూలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఆ పరిధిలోని హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎస్కేయూలో ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 4.00 గంటలకే సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. చివరిఓటు లెక్కించేదాకా సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లడానికి వీలులేదని సూచించారు. ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఒక ఈవీఎం చొప్పున 14 టేబుళ్లలో 14 ఈవీఎంలను ఒకేసారి లెక్కిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: