తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ప్ర‌జ‌ల నుంచి వివిధ ప్రాంతాల్లో ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. పరిష‌త్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తుండ‌టం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.
చేర్యాల మండలం ఆకునూరులో ప్రచారానికి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికీ ప్రతిఘటన ఎదురైంది. ‘మల్లన్నసాగర్‌‌ పేరుతో అర్జునపట్ల, ఆకునూరు గ్రామాల్లో పెద్దవాగు నుంచి ఇసుక దోచేస్తున్నారు. దాన్ని ఆపండి. అప్పటివరకు ప్రచారం చేయొద్దు’ అని అడ్డు తగిలారు. ఇసుక తోడేస్తుండటంతో చేర్యాల, మద్దూరు, నంగునూరు, కోహెడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని మండిపడ్డారు. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి కూడా బాసర మండలంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓని గ్రామానికి ప్రచారానికి వెళ్లగా స్థానికేతరులకు టికెట్లు ఎలా ఇస్తావని ప్రజలు నిలదీశారు. ‘ఇక్కడ జడ్పీటీసీ టికెట్‌‌ ఇచ్చేందుకు అర్హులైన దళితులే లేరా?’ అని ప్రశ్నించారు. 
సంగారెడ్డి జిల్లాలోని హోతి (బి) గ్రామంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌‌ను స్థానికులు నిలదీశారు. ‘ఓట్లున్నాయనే ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు. తర్వాత పట్టించుకునే వారే ఉండరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత గ్రామంలోనే తనను నిలదీయడంతో ఫరీదుద్దీన్‌‌ జీర్ణించుకోలేకపోయారు. సభా వేదిక నుంచే ప్రశ్నించిన వారిని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను కాంగ్రెస్‌‌ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: