తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణ‌త‌లో బాలిక‌లు పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో ఉత్తీర్ణత శాతం 83 శాతంగా ఉంది.  ఫలితాలను సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు. 


మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంటర్‌ ఫలితాల గందరగోళం నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి మార్కులను ఒకటికి రెండుసార్లు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలని డైరెక్టర్‌ సుధాకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఫలితాలను పాఠశాలల వారీగా పంపించనున్నారు.  జూన్ 10వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 


 ఒక పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల ఫలితాలను ఒకేసారి పొందేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించారు. కాగా, ఫలితాల్లో ఏవైనా తప్పులు, సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకుగానూ ప్రత్యేకంగా TSSCBOARD యాప్‌ను రూపొందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: