ఇంతకాలం చంద్రబాబునాయుడు అజెండా ఏమిటో అందరూ చూసిందే. ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చే మధ్య కాలం సంధికాలం. ఈ మధ్య కాలంలో రాబోయే ప్రభుత్వం టిడిపిదా లేకపోతే వైసిపిదా ? అనే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సిఎం అయితే ఏం చేయాలి ? అనే అంశంపై చంద్రబాబు తోక పత్రిక అజెండా సెట్ చేస్తోంది.

 

ఈ విషయంలో వచ్చిన ఓ కథనం ఆసక్తిగా మారింది. చంద్రబాబు లేకపోతే జగన్ ఇద్దరిలో ఎవరు సిఎం అయినా ముందుగా టేకప్ చేయాల్సిన ప్రాజెక్టు మెట్రో రైల్వే ప్రాజెక్టని తేల్చేసింది. తొలిదశ లైట్ మెట్రో విజయవాడ ? లేకపోతే అమరావతా ? అన్నది సిఎం అవ్వబోయేవారు  తేల్చుకోవాలట.  

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి వరకూ అధికారంలోకి రాబోయేది టిడిపియేనని ఊదరగొట్టింది. రెండోసారి కూడా చంద్రబాబే సిఎం అవ్వబోతున్నారంటూ జోస్యం కూడా చెప్పేసింది. అందుకు తగ్గట్లే రోజు కో కథనాన్ని వండి వర్చింది. తీరా ఫలితాలు వచ్చేసమయానికి చంద్రబాబు, జగన్ లో ఎవరు సిఎం అయినా టేకప్ చేయాల్సిన అజెండా అంటూ పెద్ద కథనం ఇచ్చిందంటే ఏమిటర్ధం ?

 

రేపటి కౌంటింగ్ లో  టిడిపి అధికారంలోకి రావటం కష్టమన్నట్లుగానే కొన్ని కథనాల్లో ఇన్ డైరెక్టుగా సంకేతాలిస్తోంది. డబ్బు పంపిణీలో టిడిపి వెనకబడిందని ఒకసారి చెప్పింది. క్షేత్రస్ధాయిలో ఎంతో కీలకమైన పోలీసులు టిడిపికి ఏమాత్రం సహకరించలేదని మరోసారి చెప్పింది. ఎలక్షన్ మ్యానేజ్మెంటు లో వైసిపి బాగా చేసుకుందని ఇంకో కథనంలో చెప్పింది. టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని, కొందరు నేతలు టిడిపిలోనే ఉంటూ అధికార పార్టీ అభ్యర్ధులకు దెబ్బ కొట్టారంటూ ఒకసారి కథనం ఇచ్చింది. అంటే టిడిపి ఓటమికి ముందుగానే చంద్రబాబు అండ్ కో ను ప్రిపేర్ చేస్తున్నట్లే ఉంది.

 

 చివరగా జగన్ సిఎం అయితే  పాదయాత్ర లేదా నవరత్నాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం కష్టమని భయపెట్టేందుకు ప్రయత్నించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బావోలేదని, కేంద్రం అస్సలు సహకరించటం లేదని హెచ్చరించింది. అసలా తోక పత్రిక బాధేంటో మాత్రం అర్ధం కావటం లేదు. అధికారంలో నుండి చంద్రబాబు దిగిపోతున్నారన్న ప్రచారాన్ని కూడా సదరు యాజమాన్యం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. అందుకనే హెచ్చరిస్తు, భయపెడుతు, అజెండా సెట్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: