తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌రువు పోయేందుకు కార‌ణ‌మైన వ్య‌క్తిపై వేటు వేసింది. కాంగ్రెస్ సారథ్యంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో...పార్టీ ప‌రువు గంగ‌పాలు అయేందుకు కార‌ణ‌మైన వ్య‌క్తిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. నగేశ్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. 


ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 11వ తేదీ శనివారం చేపట్టిన అఖిలపక్ష నిరసన దీక్షలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా కోసం వేసిన కుర్చీలో కాంగ్రెస్ నేత నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మాజీ ఎంపీ వీ హనుమంతరావు.. నగేశ్‌ను వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను నెట్టేయడంతో కోపం తెచ్చుకొన్న వీహెచ్ తన చేతిలోని మైక్‌తో నగేశ్‌పై దాడిచేశారు. ప్రతిగా నగేశ్ కూడా దాడిచేసి చొక్కాపట్టి వేదిక పైనుంచి కిందికి లాగడంతో వీహెచ్ పడిపోయారు. ఇద్దరు నేతలు ఇలా ముష్టిఘాతాలకు దిగడంతో దీక్షా వేదిక రణరంగంలా మారింది. ఈ వార్త మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది.


కాగా, ఈ ముష్టిఘాతంపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్ ఎదుట నగేశ్ నిరసనకు దిగాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: