చంద్రబాబు నలభయ్యేళ్ళ ఇండస్ట్రీ. ఆయన్ని జనాలు ఎరిగినది కూడా అలాగే. ఆయన హావ భావజాలం అంతా తమ్ముళ్ళతో పాటు, తెలుగు ప్రజలకు ఎరుకే. మరి బాబు గారు మారుతారట. ఈ మాట కూడా ఎక్కడో విన్నట్లుంది కదా అవును 2014 ఎన్నికలకు ముందు బాబు నినాదం అదే కదా తాను మారిపోయిన మనిషిని అని ఆయన స్వయంగా చెప్పుకుని ఓట్లు అడిగి మరీ అధికారంలోకి వచ్చారు.


ఇపుడు కూడా చంద్రబాబు అదే మాట అంటున్నారు. అయితే ఇది ఎన్నికల ప్రచారంలో ఎక్కడా  అనలేదు. ఎన్నికలు జరిగిపోయాక తాపీగా పడిన ఓట్లను రివ్యూ చేస్తూ పార్టీ సమావేశంలో బాబు ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యన తరచుగా ఆయన ఈ మాట అంటున్నారు. మరి బాబు ఎందుకిలా అంటున్నారు. పార్టీ తీరు సరిగ్గా లేదనా, లేక ఓటమి భయమా. అదీ కాకపోతే పార్టీ తాను అనుకున్నట్లుగా పనిచేయడంలేదనా. ఏది ఏమైనా ఈ రివ్యూల ద్వారా బాబుకు చాలా విషయాలు తెలిసాయి. అయితే ఆయన మాత్రం అవేమీ  చెప్పకుండా తాను కఠినంగా ఉంటానని అంటున్నారు.


అంటే ఇన్నాళ్ళు లూజ్ గా ఉండడం వల్ల పార్టీ పాడైపోయిందన్నది బాబు భావన కావచ్చు. అది ఈ ఎన్నికల్లో కనిపించిందన్న ఆలోచన కూడా కావచ్చు. కొత్త చంద్రబాబుని చూస్తారని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే టీడీపీకి చంద్రబాబు సుప్రీం కావచ్చునేమో కానీ క్యాడర్ కూడా అంతే బలంగానే ఉంది. ఇక నాయకులు కూడా ఎవరికి వారు పెద్ద వాళ్ళే. బాబు అయిదేళ్ళ పాలనలో గోదావరి జిల్లాకు చెందిన తన పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు అడ్డుకట్ట వేయలేకపోయారు, విజయవాడ కాల్ మనీ కేసులో తన వారే ఉన్నారని ఆరోపణలు వచ్చినా వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి.


ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు పడని జిల్లాలు ఎన్నో ఉన్నాయి. వాటి విషయంలో చూసీ చూడనట్లే బాబు ఇన్నాళ్ళు వ్యవహరించారు. ఇపుడు ఎన్నికలు అయ్యాక కొత్త బాబుని వస్తానని అంటున్నారు. తమ్ముళ్ళు ఇపుడు వాటిని పట్టించుకుంటారా.  ఒకవేళ బాబు గెలిస్తే ఈ విషయాలు మరచిపోతారు. లేదా లొల్లి ఎందుకని పక్కన పెడతారు. ఓడిపోతే ప్రతీ వారి అవసరం ఉంటుందని అసలు ముట్టుకోరు. మొత్తానికి బాబు ఏమీ చేయలేరన్న సంగతి తమ్ముళ్ళకు అర్ధమయ్యే వారు తమకు తోచినట్లుగా ప్రవర్తిస్తున్నారు. బాబు బలహీనత తెలిసాక జరిగేది అదే. అందువల్ల కొత్త బాబు దేముడెరుగు ఉన్న బాబు అలాగే ఉంటే మంచిదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: