తెలంగాణ‌లో ఓ వైపు క్షేత్ర‌స్థాయిలో చోటా నేత‌లు ప‌రిష‌త్ ఎన్నిక‌ల కుస్తీలో బిజీ బిజీగా గ‌డుపుతుంటే...మ‌రోవైపు ముఖ్య‌నేత‌లు శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో బిజీ అయిపోతున్నారు. ఇటీవల ఖాళీ అయిన 3 శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌కు  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫార్ములాను కాంగ్రెస్ కాపీ కొట్టి...త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.


స్థానిక సంస్థల కోటా నుంచి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నుంచి మండలికి ఎన్నికైన ప‌ట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరిన కొండా.. ఆ సమయంలోనే తన సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. ఈ ఎన్నిక‌కు 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు. 


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ ఆదివారం ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. కాగా, నేడు కాంగ్రెస్‌ పార్టీ త‌మ అభ్య‌ర్థులను ప్రకటించింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్‌ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభ్యర్థిగా ఉదయమోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. రాష్ట్ర నేతలు పంపిన అభ్యర్థుల జాబితాకు ఏఐసీసీ నుంచి ఆమోదం లభించింది. 


కీల‌క‌మైన ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఆస‌క్తికరంగా మూడింటికి మూడు స్థానాల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌కే అవ‌కాశం ఇచ్చారు. త‌ద్వారా ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఆ మ‌రుస‌టి రోజు కాంగ్రెస్ సైతం అదే రీతిలో ముగ్గురు రెడ్డి నేత‌ల‌కు చాన్స్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్ ఫార్ములాను కాపీ కొట్టి కాంగ్రెస్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: