జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ రాజకీయాల్లో క్రేజ్ పెరిగిపోతోంది. రేపటి ఫలితాలు ఎలాగుంటాయో ఎవరకీ తెలీదు. కానీ రాష్ట్రంలో  అధికారంలోకి రాబోయేది వైసిపినే అని సర్వేల ద్వారా నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అదే విధంగా పార్లమెంటు స్ధానాలను కూడా వైసిపి స్వీప్ చేస్తుందని జాతీయ మీడియాలో చేసిన సర్వేల్లో స్పష్టమైంది. దాంతో జాతీయ పార్టీలు, కూటములు జగన్ వెంటపడుతున్నాయి.

 

ప్రస్తుత ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి గానీ లేకపోతే కూటములకు గానీ  సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని తేలిపోతోంది. అందుకనే కూటముల్లో ఉన్న పార్టీలను నమ్ముకుంటే కష్టమని కొత్త మిత్రులను వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఇటు ఎన్డీఏ అటు యూపిఏ జగన్మోహన్ రెడ్డికి గాలమేస్తున్నాయి.

 

నరేంద్రమోడి దూతగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే జగన్ తో ఫోన్లో మంతనాలు జరిపారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ అధ్యక్షుడు రాహూల్ గాంధి దూతగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందిని రంగంలోకి దింపిందని జాతీయ మీడియా కూడా చెబుతోంది.

 

జగన్ ను ప్రసన్నం చేసుకోవటంలో భాగంగానే కాంగ్రెస్ నేతలు చంద్రబాబునాయుడు మీద విరుచుకుపడుతున్నారు.  చంద్రబాబుపై తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ విరుచుకుపడటం గమనార్హం. ఒకవైపు ఢిల్లీలో రాహూల్ తో చంద్రబాబు రాసుకుపూసుకు తిరుగుతుంటే రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాహూల్ అనుమతి లేకుండానే ఇదంతా జరుగుతుందా ?

 

ఇక, జగన్ విషయానికి వస్తే కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో ఏమంత తొందర పడుతున్నట్లు లేదు. ఫలితాలు వచ్చిన తర్వాతే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చని నేతలకు చెప్పారట. ఎవరికి మద్దతు ఇవ్వాలన్నా ముందుగా ఏపికి ప్రత్యేకహోదా నే ప్రధాన డిమాండ్ గా జగన్ ఎప్పటి నుండో చెబుతున్నారు. రాహూల్ ఇది వరకే ప్రత్యేకహోదాపై తన వైఖరి స్పష్టం చేశారు. కాబట్టి మోడి వైఖరేంటో తేలాల్సుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: