మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ నేత సాయిప్రతాప్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇటీవ‌లే గుడ్‌బై చెప్పిన కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ ఈ నెల 16వ తేదీన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాజంపేట ఎంపీగా ఆరుసార్లు విజయం సాధించిన సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీలోనే తనకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం లభించాయని భావిస్తున్నారట‌. దీంతో ఆయన ఈ నెల 16వ కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.  

కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్‌ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మరణాంతరం సాయిప్రతాప్‌ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే.


కాగా, టీడీపీకి రాజీనామా సంద‌ర్భంగా సాయి ప్ర‌తాప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సాయిప్రతాప్‌ కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘దిక్కుతోచని స్థితిలో నా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగింది. రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చాను. కానీ ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంది. నన్ను రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమన్నారు. కానీ నా పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వరు. ఇన్‌ఛార్జ్‌కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నా. నా అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగింది. కానీ నాకు మొండిచేయి చూపించారు. ఈరోజు టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నన్ను అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు నన్ను చూసి పక్కకు మొహం తిప్పుకుని చూడనట్లు వ్యవహరించారు. టీడీపీలో సరైన విలువలు ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. డబ్బులు లేని వారికి టీడీపీలో స్థానం లేదు. వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో చంద్రబాబు అన్యాయం చేసారు.`` అని ఆరోపించారు. కాగా, తాజాగా ఆయ‌న కాంగ్రెస్‌లో చేరాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: