ఎవరైనా అవసరానికి మించి దేనిగురించైనా పదే పదే మాట్లాడుతున్నారంటే ఆ అంశంపై సదరు వ్యక్తుల్లో ఆందోళన పెరిగిపోతోందని మానసిక విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబునాయుడు వ్యవహారం కూడా ఇపుడదే విధంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిపోయాయి. మరో తొమ్మది రోజుల్లో ఫలితంకూడా వచ్చేస్తుంది.  ఈలోగా మనదే గెలుపు...మనమే గెలుస్తున్నాం...అని పదే పదే చెప్పుకుంటున్నారంటే ఏమిటర్ధం ?

 

 పోలింగ్ అయిపోయిన దగ్గర నుండి చంద్రబాబు ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. ప్రతీరోజు పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్న చంద్రబాబు గెలుపు మనదే అంటూ పదే పదే చెబుతున్నారు. దాంతోనే గెలుపుపై చంద్రబాబులో ఎంతటి టెన్షన్ ఉందో అన్న విషయం అర్ధమైపోతోంది. రోజుకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులు, నేతలతో సమీక్షలు చేస్తున్నారు.

 

క్షేత్రస్ధాయిలో పోలింగ్ జరిగిన విధానం, అభ్యర్ధుల గెలుపు కోసం ఎవరేవిధంగా పనిచేశారనే విషయాన్ని అభ్యర్ధులు, నేతల ద్వారా తెలుసుకోవాలి. నేతలు చెప్పినదాన్ని చంద్రబాబు వినాలి. కానీ ఇక్కడ మాత్రం షరామామూలుగా చంద్రబాబే మాట్లాడుతున్నారు, అభ్యర్ధులు, నేతలు వింటున్నారు. ఈమాత్రం దానికే సమీక్షలనే పేరుపెట్టి అందరినీ చావకొట్టేస్తున్నారు.

 

జగన్ విషయం చూస్తే పోలింగ్ అయినరోజు మీడియాతో మాట్లాడుతూ వైసిపి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అంతే మళ్ళీ ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు. పార్టీ నేతలతో ఒక్కసారి కూడా పోలింగ్ సరళిపై సమీక్షించలేదు.  ఎన్ని సమీక్షలు చేసినా ఓటరు తీర్పులో అయితే మార్పు ఉండదన్నది వాస్తవం. ఈమాత్రం దానికి పదే పదే సమీక్షల పేరుతో అభ్యర్ధులను, నేతల బుర్రలు తినటం ఎందుకన్నది జగన్ ఆలోచన.

 

కానీ చంద్రబాబు వైఖరి మాత్రం భిన్నంగా ఉంటోంది. పోలింగ్ సందర్భంగా అభ్యర్ధులు తమకు ఎక్కడ నష్టం జరిగిందో చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. తమకు వెన్నుపోటు పొడిచిన నేతల గురించి అభ్యర్ధులు మొత్తుకుంటున్నా గెలుపు మాత్రం తమదే అంటూ చంద్రబాబు తేల్చేస్తున్నారు. నిజానికి క్షేత్రస్ధాయిలో ఉన్న అభ్యర్ధుల కన్నా గెలుపోటములపై చంద్రబాబుకు ఎక్కువ తెలుస్తుందా ? చంద్రబాబు సమీక్షలను మరో తొమ్మది రోజులు భరించాల్సిందే అంటూ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: