ఈ నెల 23న వెలువ‌డే ఫ‌లితాలు తెలుగు రాజ‌కీయాల ద‌శ‌, దిశ‌ను మార్చేస్తున్నాయి. తెలంగాణ‌లో ఎలాగూ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఫ‌లితాలు వ‌స్తాయంటున్నారు.. అక్క‌డ ఇప్ప‌టికే టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కేంద్రంలో ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది ? అన్న‌ది ఒక్క‌టే సందేహంగా ఉంది. ఇక ఏపీలో టీడీపీ, వైసీపీల‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా మార‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ గెలిస్తే ఏపీలో వైసీపీ ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మే.. చాలా మందికి జ‌గ‌న్ నాయ‌క‌త్వ సామ‌ర్థ్యంపై లెక్క‌లేన‌న్ని అనుమానాలు వ‌చ్చేస్తాయ్‌.

టీడీపీ ఓడిపోతే చంద్ర‌బాబు త‌ర్వాత ఆ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేదు. జ‌గ‌న్‌కు లోకేష్ పోటీ ఇవ్వ‌లేడ‌న్న‌ది అంద‌రికి తెలిసిపోయింది. లోకేష్ పార్టీని ముందుండి న‌డిపిస్తాడ‌న్న న‌మ్మ‌కాలు ఎవ్వ‌రికి లేవు. ఐదేళ్ల‌పాటు చంద్ర‌బాబు ఈ వ‌య‌స్సులో ఎంత వ‌ర‌కు పోరాటం చేస్తారు ? ఐదేళ్ల త‌ర్వాత అప్ప‌టి రోజులు ఎలా ఉంటాయో ?  ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. అందుకే టీడీపీలో చాలా మంది సైతం ఎవ‌రి దారి వాళ్లు చూసుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఇక ప్రీ పోల్ ఫ‌లితాల్లో చాలా మంది వైసీపీ వైపే మొగ్గు ఉన్న‌ట్టు చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది టీడీపీ సీనియ‌ర్ల‌తో పాటు బాబు తాజా కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న వారు సైతం టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ్‌.

ఇప్ప‌టికే ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా రాక‌పోతే త‌మ దారి తాము చూసుకునేందుకు ఇద్ద‌రు మంత్రులు రెడీగానే ఉన్న‌ట్టు భోగ‌ట్టా. వీరితో పాటు ప‌లు వ్యాపారాలు ఉన్న ఇద్ద‌రు, ముగ్గురు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు, హైద‌రాబాద్‌లో అనేక వ్యాపారాలు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే క్యాండెట్స్ కూడా పార్టీ మార‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా ఉంటోన్న సీనియ‌ర్ నేత‌లు సైతం ఈ సారి టీడీపీ గెల‌వ‌క‌పోతే లోకేష్ నాయ‌క‌త్వాన్ని న‌మ్ముకుని పార్టీలో ఉండేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు వీరంతా ఈ నెల 23న ఫ‌లితాలు ఎలా ?  ఉంటాయ్ ? అన్న ఒక్క అంశం కోస‌మే వెయిటింగ్ చేస్తున్నారు. 

ఇక ఈ ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌కు మ‌హా అయితే సింగిల్ డిజిట్ సీట్లు కూడా దాటే ప‌రిస్థితి లేదు. జ‌న‌సేన నుంచి గెలిచే ఎమ్మెల్యేలు సైతం త‌మ రాజకీయ భ‌విష్య‌త్తు కోసం రాజీప‌డ‌క తప్ప‌ని ప‌రిస్థితి. ప‌వ‌న్‌ను న‌మ్ముకుని ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉంటే త‌మ‌కు ఒరిగేదేం ?  లేద‌న్న నిర్ణ‌యానికి వారు వ‌చ్చేశారు. వారి వ్య‌క్తిగ‌త అభివృద్ధి, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం వారు కూడా వైసీపీలోకి జంప్ చేసేయొచ్చ‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయ్‌. తెలంగాణ‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం త‌మ భ‌విష్య‌త్తు కోసం పూర్తిగా రాజీప‌డి... ఫ‌లితాలు వ‌చ్చిన రెండు, మూడు నెల‌ల‌కే కారెక్కేశారు. రేపు ఏపీలోనూ అదే ప‌రిస్థితి ఉండ‌బోతోంది. ఈ క్ర‌మంలోనే ఎవ్వ‌రూ ఊహించ‌ని నేత‌లు కూడా ఫ్యాన్ గూటికి చేరిపోవ‌చ్చంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: