అంతా బ్రహ్మాండంగా ఉంది. మనమే గెలవబోతున్నామని అభ్యర్ధులను, నేతలను హిప్నటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబునాయుడుకు కర్నూలు  జిల్లా సమీక్ష పెద్ద షాకిచ్చింది. కర్నూలు, నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులు, నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా గతంలో ఏ జిల్లాలో లేని విధంగా అభ్యర్ధులు, నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకోవటంతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది.

 

మొత్తం సమీక్షలో తేలిందేమిటంటే అభ్యర్ధుల్లో కూడా ఒకరి గెలుపుకు మరొకరు గండి కొట్టారని. అలాగే కొందరు అభ్యర్ధుల ఓటమే ధ్యేయంగా మరికొందరు వ్యతిరేకంగా పనిచేశారని కూడా తేలిపోయింది. విచిత్రమేమిటంటే తమ వాదనకు మద్దతుగా మంత్రులు కొన్ని ఆధారాలను కూడా చూపించటంతొ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు గొడవకు దిగారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక చంద్రబాబు ఆరోపణలకు ఫులిస్టాప్ పెట్టేశారు.  

 

ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ పత్తికొండలో తన కొడుకు కెఇ శ్యాంబాబుకు వ్యతిరేకంగా సీనియర్ నేత తుగ్గలి నాగేంద్ర పనిచేశారని ఆరోపించారు.  ఆలూరులో అభ్యర్ధి కోట్ల సుజాతమ్మకు వ్యతిరేకంగా వీరభద్రగౌడ్, కోడుమూరులో విష్ణువర్ధన్ రెడ్డిపైన కూడా కోట్ల వర్గం ఆరోపణలు చేసింది. నంద్యాలలో సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి పార్టీ విజయావకాశాలకు గండి కొట్టారంటూ మంత్రి ఫరూక్, అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదు చేయటం గమనార్హం.

 

 నంద్యాల, ఆళ్ళగడ్డలో మొదటినుండి భూమా కుటుంబానికి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డికి ఏమాత్రం పడదు. పై నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీ చేయాలని ఏవి ప్రయత్నించారు. భూమా అఖిల కు మధ్య ఏవి వర్గాల మధ్య పెద్ద గొడవే జరిగాయి. కాబట్టి భూమా కుటుంబానికి వ్యతిరేకంగానే ఏవి పనిచేస్తారని అందరూ అనుకుంటున్నదే.

 

ఇక ఆలూరులో వీరభద్రగౌడ్ టికెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. నాలుగున్నర సంవత్సరాల పాటు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ చివరినిముషంలో కోట్ల కుటుంబం టిడిపిలో చేరిందని కోట్ల సూర్యప్రకాశరెడ్డి భార్య సుజాతమ్మకు ఆలూరులో టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దాంతో వీరభద్రగౌడ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఫిర్యాదులందాయి. ఇక, పత్తికొండలో కెఇ శ్యాంబాబు ఓటమికి నాగేంద్ర పనిచేశారని చెప్పారు. చూడబోతే సమీక్షల్లోనే నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి ఓటమి తప్పదేమో అనిపిస్తోంది. ఇవి కాకుండా బయటపడనివి ఇంకెన్ని ఉన్నాయో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: