చూడబోతే అలాగే ఉంది తెలుగుదేశంపార్టీ వైఖరి. ప్రతీ ఏడాది టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28వ తేదీ నుండి మూడురోజులు మహానాడు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పుడప్పుడు మహానాడును జరపని సందర్భాలు కూడా ఉన్నాయి లేండి. దాన్ని కారణంగా చూపే రానున్న మహానాడుకు మంగళం పాడే ఆలోచనలో చంద్రబాబునాయుడు, సీనియర్ నేతలున్నట్లు అనుమానం వస్తోంది.

 

మే 23వ తేదీ ఫలితాల్లో టిడిపి గెలుపు అవకాశాలు దాదాపు కష్టమనే అభిప్రాయం అందరిలోను కనిపిస్తోంది. కాకపోతే మనమే గెలుస్తున్నామంటూ చంద్రబాబు ఒకటే ఊదరగొడుతున్నారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? అనేదే నేతలందరినీ వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్న.

 

మంగళవారం ఉదయం చంద్రబాబును మంత్రులు కలిసినపుడు మహానాడుపై చర్చ జరిగింది. ఎన్నికల దృష్ణ్యా నేతలందరూ బిజీగా ఉన్న కారణంగా మహానాడు నిర్వహణకు సమయం సరిపోదనే వాదన బయలుదేరింది. గతంలో కూడా కొన్ని సార్లు మహానాడును జరపని సందర్భాలున్నాయని నేతలు చంద్రబాబుకు గుర్తుచేశారు.

 

మే 23వ తేదీన ఫలితాలు ఎలా ఉంటాయో అన్న టెన్షన్ తోనే నేతలకు నిద్ర కూడా సరిగా పట్టటం లేదు.  23వ తేదీన ఫలితాల్లో గనుక టిడిపి ఓడిపోతే అభ్యర్ధులు కావచ్చు నేతలు కావచ్చు తుపాకి గుండుకు కూడా దొరకరు కొంతకాలం పాటు. ఎందుకంటే, మూడు రోజుల మహానాడు నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళు మహానాడు నిర్వహించారంటే అధికారంలో ఉంది కాబట్టి సరిపోయింది. ఇపుడు నేతలు తమ జేబుల్లో నుండే ఖర్చుపెట్టాలి.

 

అందుకనే చాలామంది నేతలు మహానాడు జరపకుండా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నట్లున్నారు. దానికితోడు పార్టీ ఓడిపోతే దాని ప్రభావం కూడా మహానాడు నిర్వహణపై పడుతుంది. మరీ ఓడిపోయిన ఐదు రోజులకే మూడు రోజుల మహానాడు అంటే నేతలు కూడా పెద్దగా ఇష్టపడకపోవచ్చు. మొక్కుబడిగా ఒక్కరోజుకే పరిమితం చేస్తారా లేకపోతే మొత్తానికే  మహానాడుకు మంగళం పాడేస్తారా ? అన్నదే సస్పెన్స్.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: