క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలతో అందరిలోను ఇవే అనుమానాలు మొదలయ్యాయి. అజెండా అంశాలైపోయిన తర్వాత మంత్రులతో రాజకీయ చర్చలు చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ఫలితాల తర్వాత ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

 

 అదే జరిగితే తమకు చాలా మంచిదని చంద్రబాబు ఆనందంగా చెప్పారు. గడ్కరీ ప్రధాని అయితే చాలా మంచిదన్నారు. ఎందుకంటే ఆయనతో టిడిపికి మంచి సంబంధాలున్నాయంటూ చంద్రబాబు ఆనందంతో చెప్పారు. చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలతో మంత్రులకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది.  అవకాశం ఉంటే చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏ వైపు యూ టర్న్ తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సంకేతాలే కనబడుతున్నాయి.

 

యుటర్న్ లు తీసుకోవటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ప్రత్యేకహోదా విషయంలో ఎన్నిసార్లు యుటర్న్ లు తీసుకున్నది అందరూ చూసిందే. అలాగే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అంశంలో కూడా చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చింది చూశారు. తనకు అవసరమైనపుడల్లా యుటర్న్ లు తీసుకోవటం వల్లే వైసిపి రాజ్యసభ సభ్యుడు చంద్రబాబుకు యుటర్న్ అంకుల్ అంటూ పేరే పెట్టేశారు.

 

అదే విధంగా నితిన్ గడ్కరీ విషయంలో ఇపుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఎన్టీఏలోకి దూకటానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. నిజానికి చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు రేపటి కౌంటింగ్ మీదే ఆధారపడుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారం కోల్పోయినా ఎంపి సీట్లు గనుక తెచ్చుకుంటే జాతీయ రాజకీయాల్లో ఏదోలా నెట్టుకొచ్చేస్తారు.

 

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఎంపి సీట్లు తెచ్చుకోవటం దాదాపు జరగదనే చెప్పాలి. వైసిపి  రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే దామాషాలో ఎంపి సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి మోడి స్ధానంలో గడ్కరీ అయినా ఎవరైనా చంద్రబాబుకు ఒకటే.

 

మొన్నటి వరకూ బిజేపి అధికారంలోకి రాదని బల్లగుద్ది చెప్పిన ఇదే చంద్రబాబు ఇపుడు గడ్కరీకి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని చెప్పారంటే ఏమిటర్ధం ? మళ్ళీ ఎన్గీఏనే అధికారంలోకి వస్తుందనే ఫీడ్ బ్యాక్ చంద్రబాబుకు అందుండాలి. అందుకే గడ్కరీ జపం మొదలుపెట్టారంటే చంద్రబాబులో యూటర్న్ ఆలోచన మొదలైందనే అనుకోవాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: